ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. దిల్లీలో 5 శాతానికి పాజిటివిటీ రేటు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను...

Published : 01 Feb 2022 23:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు స్థానిక యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు సినిమా హాళ్లు, రెస్టారంట్లు, ఈత కొలనులు, థీమ్‌ పార్కులను సగం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, పార్కులు ఎప్పటిలాగే తెరిచి ఉంటాయని వెల్లడించింది. వివాహాలకు బహిరంగ ప్రదేశాలు, బాంకెట్ హాల్స్‌లో 25 శాతం సామర్థ్యం లేదా 200 మంది అతిథులు.. ఏది తక్కువైతే దానికి వీలు కల్పించింది.

మరోవైపు ముంబయిలో వరుసగా రెండో రోజు మంగళవారం వెయ్యిలోపు రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 803 కొత్త కేసులు బయటపడ్డాయి. సోమవారం నమోదైన 960 కేసులతో పోలిస్తే 16 శాతం తక్కువ. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం నిన్నటితో పోల్చితే 2.1 నుంచి 1.55 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం నగరంలో 8,800కు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు.

దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 2683 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసుల (2,779)తో పోల్చితే కాస్త తగ్గుదల నమోదైంది. 27 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.09 శాతానికి తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని