Breakthrough infections: ఊహించిన స్థాయిలోనే బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు: ఇన్సాకాగ్‌

శంలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన వారి సంఖ్య ఊహించిన స్థాయిలోనే ఉందని కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం.. ఇన్సాకాగ్‌ తెలిపింది.

Published : 02 Sep 2021 01:18 IST

దిల్లీ: కొవిడ్‌ నుంచి రక్షణ కోసం రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నాక కూడా కొందరికి కరోనా సోకుతోంది. దీన్నే బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్లుగా పేర్కొంటారు. అయితే వ్యాక్సిన్‌ తర్వాత కొవిడ్‌ బారిన పడిన ఇలాంటి వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తిన దాఖలాలు లేవని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. ఈ విధంగా దేశంలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన వారి సంఖ్య ఊహించిన స్థాయిలోనే ఉందని కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం.. ఇన్సాకాగ్‌ తెలిపింది. ఇప్పటి వరకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన సంఖ్య, ఇతర ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయం గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా డెల్టా రకమే అధికంగా విస్తృతిలో ఉందని పేర్కొంది.

‘‘దేశ జనాభాలో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారి సంఖ్య, కొవాగ్జిన్‌/కొవిషీల్డ్‌ వంటి వ్యాక్సిన్ల సమర్థతను తగ్గించగలిగే డెల్ట్లా వేరియంట్‌ ప్రభావం వంటివి విశ్లేషించినప్పుడు దేశంలో వ్యాక్సినేషన్‌ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఊహించిన స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుత వ్యాక్సిన్లు తీవ్రమైన అనారోగ్యం నుంచి తప్పించడమే కాకుండా ప్రజారోగ్య వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి’’ అని ఇన్సాకాగ్‌ పేర్కొంది. అధిక తీవ్రత కలిగిన డెల్టా ఉప రకాలు, డెల్టా ప్లస్‌కు చెందిన ఏవై.1- ఏవై.12 వరకు కలిగిన రకాలు విశ్లేషించినట్లు ఇన్సాకాగ్‌ వెల్లడించింది. మొత్తం 856 శాంపిళ్లను విశ్లేషించింది. డెల్టా ప్లస్‌కు చెందిన ఏ.12 రకం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన రీతిలో కొత్త వేరియంట్‌ గానీ, పరిశోధించదగ్గ వేరియంట్‌ ఏదీ లేదని ఇన్సాకాగ్‌ అభిప్రాయపడింది. డెల్టా వేరియంట్‌ మాదిరిగానే డెల్టా ఉపరకాల్లోనూ బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్లు అదే స్థాయిలో ఉంటాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని