JNU Campus Violence: జేఎన్‌యూ హింసాత్మక ఘటనల్లో అరెస్టులు జరగలేదు: కేంద్రం

గతేడాది జనవరిలో జేఎన్‌యూ క్యాంపస్‌లోకి కొందరు దుండగులు చొరబడి పలువురు విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేసిన ఘటనలో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని .....

Published : 03 Aug 2021 23:31 IST

దిల్లీ: గతేడాది జనవరిలో జేఎన్‌యూ క్యాంపస్‌లోకి కొందరు దుండగులు చొరబడి పలువురు విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేసిన ఘటనలో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ అరెస్టులు మాత్రం జరగలేదని చెప్పారు. దిల్లీలోని వసంత్‌ కుంజ్‌ (నార్త్‌) పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా.. దర్యాప్తు కోసం క్రైం బ్రాంచ్‌ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేసినట్టు దిల్లీ పోలీసులు చెప్పారన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సాక్షుల విచారణ, ఫుటేజీల సేకరణ, విశ్లేషణ, గుర్తించిన అనుమానితులకు పరీక్షలు వంటివి జరిగినట్టు వివరించారు.

గతేడాది జనవరి 5న జేఎన్‌యూ ప్రాంగంణంలోకి కొందరు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై రాడ్డులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ సహా 34 మంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హింసాత్మక ఘటనలకు నిరసనగా హైదరాబాద్ సహా ముంబయి, చెన్నై, పుణె, కోల్‌కతా, ఒడిశా, అహ్మదాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని