Congress Chief: పార్టీలో చిన్నా, పెద్దా లేరు.. పార్టీ బలోపేతానికి అందరూ కృషి : మల్లికార్జున ఖర్గే

పార్టీలో చిన్నా, పెద్దా ఎవ్వరూ లేరని.. కార్యకర్తగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గేకు సొంత పార్టీ నేతల నుంచే కాకుండా ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలిపారు.

Updated : 19 Oct 2022 19:49 IST

దిల్లీ: దేశంలో మత విద్వేషాలు, హింస, దాడులు పెరిగాయని కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరుగుతోన్న దాడులను కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఖర్గే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చిన్నా, పెద్దా తేడా లేదని, కార్యకర్తలుగా ప్రతిఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని  ఖర్గే పిలుపునిచ్చారు.

‘రాహుల్‌ గాంధీ నాకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీలో సైనికుడిగా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. సోనియా గాంధీకి కృతజ్ఞతలు. ఆమె నాయకత్వంలో కేంద్రంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అంతకుముందు ఖర్గేకు అభినందనలు తెలిపిన రాహుల్‌ గాంధీ.. సుదీర్ఘ అనుభవం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం వంటి అంశాలు పార్టీకి ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఇదిలాఉంటే, అక్టోబర్‌ 26న కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెల్లడించింది.

ప్రధాని మోదీ అభినందనలు..

భారత జాతీయ కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపడుతోన్న మల్లికార్జున ఖర్గేకు అభినందనలు. ఆయన పదవీకాలం సాఫీగా కొనసాగాలని ఆశిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని