Sambhit Patra: ‘ఎవరూ క్వీన్‌ విక్టోరియా కాదు..!’ కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో రాహుల్‌ గాంధీ ‘ఈడీ’ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణులు నేడు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ‘ఈడీ’ని దుర్వినియోగం చేస్తోందని కేంద్రంపై...

Updated : 20 Jun 2022 15:53 IST

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో రాహుల్‌ గాంధీ ‘ఈడీ’ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ శ్రేణులు నేడు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ‘ఈడీ’ని దుర్వినియోగం చేస్తోందని కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఆరోపణలపై తాజాగా భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందిస్తూ.. చట్టం ముందు అందరూ సమానులేనని వ్యాఖ్యానించారు. ‘ఒకరిపై విచారణ జరగదు అనడానికి.. ఈ దేశంలో ఎవరూ క్వీన్‌ విక్టోరియా కాదు. యువరాజు కాదు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఒక కుటుంబం, రాహుల్ గాంధీ పాత్ర గురించి ప్రజలకు తెలుసు. అవినీతి జరిగితే విచారణ సహజమే' అని తెలిపారు. దేశంలో అవినీతి జరిగితే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సరే విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.

5310 కేసులు మోదీ హయాంలో పెట్టినవే: కాంగ్రెస్‌

మరోవైపు.. భాజపా ఆదేశాలను పాటించే వారికి అన్ని ఆరోపణల నుంచి విముక్తి కల్పించే పథకాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు మూయించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఆరోపించారు. దిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈడీ వద్ద పెండింగ్‌లో ఉన్న 5,422 కేసుల్లో దాదాపు 5,310 కేసులు మోదీ హయాంలోనే నమోదయ్యాయని, దీన్నిబట్టి చూస్తే ప్రతిపక్షాలపై కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొస్తోందో స్పష్టమవుతోందన్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేతలు నేటి సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తారని మాకెన్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని