
Vaccine: బలవంతంగా కొవిడ్ వ్యాక్సిన్ వేయలేం: కేంద్రం
దిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఒక వ్యక్తి సమ్మతి లేకుండా కొవిడ్ టీకా వేయాలని సూచించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపునివ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఎలాంటి సేవలు పొందడానికైనా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ ఇప్పటి వరకు మార్గదర్శకాలేమీ జారీ చేయలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ‘ఎవారా ఫౌండేషన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఇంటింటికి వెళ్లి దివ్యాంగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని సేవలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరైన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పటి వరకు వారికి సర్టిఫికెట్ చూపించాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సర్టిఫికెట్ తప్పనిసరేం కాదని స్పష్టం చేసింది. పైగా వ్యక్తుల సమ్మతి లేకుండా టీకా ఇవ్వలేమని తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్లు కేంద్రం తెలిపింది. ఇది అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రకటన అని పేర్కొంది. అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా చేశామని తెలిపింది. అంతేగానీ, బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది.