PM- Kisan: పీఎం కిసాన్‌ పెంపులేదు.. ఆ చట్టాల్ని మళ్లీ తెచ్చే ఆలోచనలేదు: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టంచేశారు. ....

Published : 12 Feb 2022 02:13 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టంచేశారు. ఈ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి ఉందా? అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అలాగే, పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఫిబ్రవరి 8, 2022 నాటికి దేశవ్యాప్తంగా 11.78లక్షల మందికి పైగా లబ్దిదారులకు దాదాపు రూ.1.82లక్షల కోట్లు మొత్తం పలు వాయిదాల రూపంలో  సాయం అందించినట్టు తెలిపారు. అయితే, వీరిలో 48.04లక్షల మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. అందువల్ల ఈ పథకం కింద 11.30 కోట్ల మంది మాత్రమే అర్హులు ఉన్నారన్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న సాయానికి అదనంగా డబ్బులు ఇచ్చే ప్రతిపాదన ఇప్పటికైతే లేదని మంత్రి స్పష్టంచేశారు.

దేశంలోని అర్హులైన రైతులకు పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేలు చొప్పున ఏడాదికి మొత్తంగా రూ.6వేలు సాయంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రధాన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ రూ.2,52,297 కోట్లుగా ఉందన్న కేంద్రమంత్రి.. ఇది ప్రస్తుత ధరల ప్రకారం మన దేశ జీడీపీలో 1.2 శాతమని తెలిపారు. 2020-21లో కరోనా మహమ్మారి సంక్షోభం ఉన్నా వ్యవసాయ ఎగుమతుల్లో 22.8 శాతం వృద్ధి నమోదైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని