8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై.. కేంద్రం క్లారిటీ..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది

Updated : 06 Sep 2022 16:36 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. 8వ వేతన కమిషన్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ సోమవారం లోక్‌సభకు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన కమిషన్‌ను సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందా.. ఒకవేళ అలా అయితే 2026 జనవరి 1 నుంచి కొత్త కమిషన్‌ను అమలు చేసే అవకాశాలున్నాయా? అని విపక్షాలు అడిగిన ప్రశ్నకు పంకజ్‌ చౌధరీ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ‘‘ప్రస్తుతానికి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద పరిశీలనలో లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల వాస్తవ విలువ తగ్గితే.. దానికి పరిహారంగా కరవు భత్యం (డీఏ) చెల్లిస్తున్నామని చౌధరీ ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక.. ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ రేటును సవరిస్తున్నట్లు తెలిపారు. 2014లో కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. 2016 జనవరి 1 నుంచి ఈ కమిషన్‌ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని