Kiren Rijiju: న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు : కేంద్రం

ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు (Reservation in Judiciary) కల్పించడం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు (Kiren Rijiju) స్పష్టం చేశారు. 

Published : 09 Feb 2023 16:24 IST

దిల్లీ: న్యాయవ్యవస్థ(Judiciary)లో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు (Reservation) కల్పించడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, జడ్జీలుగా నియమించే సమయంలో ప్రాతినిధ్యం లేని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సిఫార్సు చేయాలని జడ్జీలు, కొలీజియంకు సూచించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) పార్లమెంటులో వెల్లడించారు.

న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా..? అని డీఎంకే నేత తిరుచ్చి శివ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. దీనికి బదులిచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి .. ‘ప్రస్తుతం అనుసరిస్తోన్న విధానం, నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు. అయినప్పటికీ, న్యాయమూర్తులుగా పేర్లను సిఫార్సు చేసేటప్పుడు వెనకబడిన తరగతులు, మహిళలతోపాటు న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం లేని వర్గాల వారి పేర్లను పొందుపరచాలని జడ్జీలకు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు గుర్తుచేశాను’ అని వెల్లడించారు.

ఇక గుజరాత్‌లో పెండింగు కేసులకు సంబంధించి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14.47లక్షల కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. న్యాయ సహాయం అభ్యర్థించే వారికోసం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (NLSA) నియమించే లాయర్ల సంఖ్యను పెంచాలని సభ్యులు అడిగిన ప్రశ్నకూ కేంద్ర మంత్రి స్పందించారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్‌ఎల్‌ఎస్‌ఏతోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎల్‌ఎస్‌ఏ, జిల్లా స్థాయిలో డీఎల్‌ఎస్‌ఏ, తాలూకా స్థాయిలోనూ ఉచితంగా న్యాయ సేవలు అందుతున్నాయని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని