
Afghanistan: ‘అఫ్గాన్ సుప్రీం కోర్టు ఆదేశాలిస్తేనే బహిరంగ మరణ శిక్షలు’
కాబుల్: అఫ్గాన్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయనంతవరకు దేశంలో బహిరంగ మరణ శిక్షల అమలు, మృతదేహాల వేలాడదీత చేయొద్దని తాలిబన్ ప్రభుత్వం స్థానిక అధికారులకు స్పష్టం చేసింది. సంబంధిత నేరస్థుడిని ప్రజల మధ్య శిక్షించాల్సిన అవసరం లేనప్పుడు, కోర్టు ఆదేశాలు రానంతవరకు.. బహిరంగ శిక్షలు విధించకూడదని మంత్రిమండలి నిర్ణయించినట్లు తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. ఒకవేళ నేరస్థుడిని బహిరంగంగా శిక్షించినట్లయితే.. అతను చేసిన నేరం గురించి ప్రజలకు తెలిసేలా వివరించాలని చెప్పారు.
అమెరికా తీవ్ర అభ్యంతరం నేపథ్యంలో..
అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు- చేతులు నరకడం, బహిరంగ మరణశిక్షలు వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని ఇటీవల తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అఫ్గాన్ ప్రజలకు అండగా నిలుస్తామని, తాలిబన్లు తమ దారుణాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేసింది. గతంలో అఫ్గాన్‌లో హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు- చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.
కాందహార్ పేలుళ్లకు మాదే బాధ్యత..
అఫ్గానిస్థాన్ కాందహార్‌లోని ఓ షియా మసీదులో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడులకు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రకటించింది. ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘటనలో 60 మందికి పైగా మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన విషయం తెలిసిందే. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు తొలుత మసీదు కాపలాదారులను కాల్చి చంపి, లోపలికి చొరబడ్డారు. అనంతరం తమను తాము పేల్చేసుకున్నారు. అఫ్గాన్‌లో వరుసగా రెండో శుక్రవారం ఈ తరహా దాడులు జరగడం గమనార్హం. అంతకుముందు కుందుజ్ ప్రావిన్స్‌లో దాడికి పాల్పడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.