India - China: సరిహద్దు వివాదం.. చైనా చర్చలకు వచ్చింది.. వెళ్లింది..!

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మధ్య ఆదివారం జరిగిన 13వ

Updated : 11 Oct 2021 10:58 IST

ఫలితం శూన్యమన్న భారత ఆర్మీ

దిల్లీ: సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మధ్య ఆదివారం జరిగిన 13వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఫలించలేదు. వివాద పరిష్కారం కోసం భారత్‌ చేసిన ‘నిర్మాణాత్మక సూచనల’ను చైనా అంగీకరించకపోవడమే ఇందుకు కారణమని భారత ఆర్మీ సోమవారం వెల్లడించింది. 

సరిహద్దుల్లో దెప్సాంగ్‌ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య ఆదివారం కోర్ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు దాదాపు ఎనిమిదన్నర గంటల పాటు జరిగాయి. ఈ చర్చల్లో భారత్‌.. బలగాల ఉపసంహరణతో పాటు పలు అంశాలను లేవనెత్తింది. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాల ఏకపక్ష చర్యలతో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావించినట్లు భారత ఆర్మీ తాజాగా వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణ కోసం చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అయితే వీటిపై చైనా నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని సైన్యం తెలిపింది. 

‘‘నిన్న జరిగిన సమావేశంలో ఉద్రిక్త ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కోసం భారత్‌ పలు నిర్మాణాత్మక సూచనలు చేసింది. కానీ చైనా వాటికి అంగీకరించలేదు సరికదా.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వేరే ఎలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు. దీంతో ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాల పూర్తి దృక్పథాన్ని చైనా పరిగణనలోకి తీసుకుంటుందని.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌కు కట్టుబడి సరిహద్ద వివాదంపై సత్వర పరిష్కారానికి పొరుగు దేశం కృషి చేస్తుందని భావిస్తున్నాం’’ అని భారత సైన్యం వెల్లడించింది. 

గత ఏడాది నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో భారత్‌- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని సడలించడానికి పలు దఫాలుగా కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఫిబ్రవరిలో పాంగాంగ్‌ సరస్సు దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని