Corona: కరోనా కేసుల్లో పెరుగుదల లేదు.. కానీ!: రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు

చైనా సహా పలు దేశాల్లో కరోనా(Corona) కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచనలు చేశారు.

Published : 21 Dec 2022 18:08 IST

దిల్లీ: చైనా, అమెరికా సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా(Corona virus) కేసులు పెరుగుతున్న వేళ దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా(Randeep Guleria) కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల లేకపోయినప్పటికీ.. అందరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు ఎక్కడా పెరగట్లేదు. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. సరైన నిఘా అవసరం. అలా ఉంటేనే ఎక్కడైనా కేసులు పెరిగితే వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి వైరస్‌ని నియంత్రించగలం. కొత్త వేరియంట్‌లను గుర్తించి ఇన్ఫెక్షన్‌ మరింత వ్యాప్తి చెందకుండా చూడగలం. చైనాతో పోలిస్తే మన దగ్గర పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. ఎందుకంటే మనం భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాం. అధిక ముప్పు ఉన్నవారిలో అధిక శాతం మంది బూస్టర్‌ డోసులూ తీసుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, చైనాలో కఠిన ఆంక్షలు అమలుచేసినప్పటికీ అక్కడ వైరస్‌ విజృంభణకు కారణం ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌7 అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ వేరియంట్‌ భారత్‌లోనూవ్యాప్తి చెందింది. గుజరాత్‌లో తొలి కేసు నమోదైనట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబర్‌లోనే గుర్తించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ రకం కేసులు మూడు వరకు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా.. ఒడిశాలో ఒకటి వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అయితే, ఈ కేసుల్లో పెరుగుదల గణనీయంగా ఏమీ లేదని ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ రోజు వైద్యరంగ నిపుణులు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూసినప్పటికీ కేసుల్లో మాత్రం పెరుగుదల ఏమీ లేదని తెలిపారు. ఎలాంటిపరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నట్టు వెల్లడించారు. ప్రజలంతా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని నీతిఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకేపాల్‌ సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు/వృద్ధులు కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని