Nirmala Sitharaman: ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వం.. నిర్మలా సీతారామన్‌

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని.. ఇకపై ఏ రాష్ట్రాలకూ ఆ హోదా ఇవ్వబోమని  ఆర్థిక సంఘం తేల్చి చెప్పిన విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి స్పష్టంచేశారు.

Published : 17 Feb 2023 21:28 IST

భువనేశ్వర్‌: ఏ రాష్ట్రానికీ కొత్తగా ప్రత్యేక కేటగిరీ హోదా(Special Category Status) ఉండదని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) తేల్చి చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఒడిశాకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి డిమాండు వస్తోన్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని గతంలోనే ఆర్థిక సంఘం స్పష్టంచేసిందని తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో తాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌- 2023-24లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి(MGNREGS) నిధుల కేటాయింపులో భారీగా కోత విధించారన్న విమర్శలను కొట్టిపారేశారు. నరేగాకు నిధుల కేటాయింపులు తగ్గలేదని.. ఈ పథకం డిమాండ్‌ ఆధారితమైంది గనక అందుకనుగుణంగా  నిధుల కేటాయింపులు పెంచుతూ చివరలో సవరణలు చేస్తున్నామన్నారు. గత ఏడెనిమిది బడ్జెట్‌లను సమీక్షిస్తే.. ఆ విషయం అర్థమవుతుందని చెప్పారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఒక ఎత్తయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించి డిమాండ్‌కు అనుగుణంగా సవరించడం మరో విధానమని వెల్లడించారు.   

అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై సెబీ దర్యాప్తుపై ఏమైనా అప్‌డేట్‌ ఉందా అని విలేకర్లు అడగ్గా.. ‘‘సెబీ ఓ స్వతంత్ర రెగ్యులేటరీ సంస్థ. వాళ్లు ఏం గుర్తించినా.. ఎలాంటి సోదాలు చేసినా.. అది వారి వద్దే ఉంటుంది. ప్రతి అంశాన్నీ వారు ప్రభుత్వానికి నివేదించరు. ఈ అంశం కోర్టులో ఉంది. అందువల్ల దీనిపై వ్యాఖ్యానించడం సరికాదు’’ అని నిర్మలమ్మ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని