Indigo: విమానంలో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన వార్తలు.. ఖండించిన ఇండిగో

తమ విమానంలో ఎలాంటి ఘర్షణపూరిత ఘటనలు చోటుచేసుకోలేదని ఇండిగో స్పష్టం చేసింది. మద్యం మత్తులో ప్రయాణికులు సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌లైన్‌ స్పష్టతనిచ్చింది.

Published : 10 Jan 2023 01:21 IST

దిల్లీ: దేశీయ విమానంలో కొందరు ప్రయాణికులు మద్యం సేవించి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన వార్తలను ప్రముఖ ఎయిర్‌లైన్‌ ఇండిగో (Indigo) ఖండించింది. అలాంటి వివాదాస్పద ఘటనేదీ జరగలేదని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. ‘‘దిల్లీ (Delhi) - పట్నా (Patna) విమానంలో జరిగిన ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సోషల్‌మీడియాల్లో వస్తున్నట్లుగా ఆ విమానంలో వివాదాస్పద, ఘర్షణపూరిత ఘటనేదీ జరగలేదు’’ అని ఇండిగో వెల్లడించింది.

ఆదివారం రాత్రి దిల్లీ నుంచి పట్నా వచ్చిన ఇండిగో విమానంలో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో రచ్చరచ్చ చేసినట్లు ఈ ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరు ఎయిర్‌హోస్టస్‌ను వేధించడమే గాక, అడ్డొచ్చిన కెప్టెన్‌పై దాడి చేసినట్లు తొలుత కథనాలు వెలువడ్డాయి. నిందితులకు ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండిగో (Indigo) స్పష్టతనిచ్చింది. అయితే, దేశీయ విమానంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించినందుకు గానూ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసినట్లు ఆ తర్వాత అధికారిక వర్గాలు వెల్లడించాయి. విమానంలో ఘర్షణలాంటి ఘటనలేం జరగలేదని, అయితే ప్రొటోకాల్‌ ప్రకారం.. మద్యం సేవించినందుకు వారిపై ఎయిర్‌పోర్టు అధికారులకు ఇండిగో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాయి.

‘‘దేశీయ విమానాల్లో మద్యం సేవించడం నిషేధం. కానీ, ఆ ప్రయాణికులు విమానం ఎక్కేముందే మద్యం సేవించి ఉన్నారు. విమానంలోనూ తాగేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఇండిగో (Indigo) సిబ్బంది ఫిర్యాదు మేరకు సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు ఆ ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు’’ అని సదరు వర్గాలు స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని