Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్‌ ఛైర్మన్‌

జమిలి ఎన్నికలకు సంబంధించిన నివేదిక రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌ అన్నారు.

Published : 27 Sep 2023 22:01 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించే అంశంపై లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు ఇంకా తుది రూపు ఇవ్వలేదని.. దీన్ని ఖరారు చేసేందుకు ఎలాంటి కాలవ్యవధి పెట్టుకోలేదన్నారు. బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వశాఖకు పంపినట్టు చెప్పారు. జమిలి ఎన్నికల నివేదిక రూపకల్పనలో ఇంకా కొంత వర్కు చేయాల్సి ఉందని గుర్తించామని.. ఇంకా నివేదిక ఖరారు చేసే పనిలో ఉన్నామన్నారు. ‘జమిలి’ ఎన్నికల అంశం లాకమిషన్‌ వద్ద ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

మరోవైపు, దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల్లో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం తెరపైకి రాగా.. ఇటీవల జమిలి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో మోదీ సర్కార్‌ ఓ కమిటీ నియమించింది. అయితే, ఇటీవల భేటీ అయిన ఈ కమిటీ ‘జమిలి’పై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని