Nobel Prize: శరణార్థుల వ్యథకు అక్షర రూపం.. వరించిన నోబెల్‌ పురస్కారం

సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌

Updated : 07 Oct 2021 17:04 IST

స్టాక్‌హోం: సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. 

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్‌ వలసవెళ్లారు. 1963లో బ్రిటిష్‌ వలస పాలన నుంచి జాంబిబర్‌ స్వాతంత్ర్యం పొంది టాంజానియాలో భాగంగా మారింది. అయితే ఆ తర్వాత అధ్యక్షుడు అబిద్‌ కరుమే పాలనలో అరబ్‌ జాతీయులపై వివక్ష పెరగడమే కగా, వారి ఊచకోతలు జరిగాయి. గుర్నా కూడా ఇదే అరబ్ వర్గానికి చెందిన వారే. దీంతో తన భవిష్యత్తు కోసం ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందడం కోసం కుటుంబాన్ని, దేశాన్ని విడిచి ఇంగ్లాండ్‌కు వచ్చేశారు. అప్పటికి ఆయన వయసు 18ఏళ్లే. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోనే ఉన్నత విద్యను అభ్యసించి. కేంట్రబెరీలోని కెంట్‌ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన ఆయన తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. సంస్కృతి, ఖండాల మధ్య నలిగిపోయిన శరణార్థుల వ్యథను ప్రత్యక్షంగా చూసిన ఆయన వాటికి అక్షర రూపమిచ్చారు. 21ఏళ్ల వయసులోనే నవలలు రాయడం ప్రారంభించిన గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 1994లో ఆయన రాసిన ప్యారడైజ్‌ అనే నవల బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయ్యింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని