Noida: పాత కార్లపై నజర్‌.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్‌

నోయిడాలో కాలం చెల్లిన లక్షలాది కార్లను అధికారులే తుక్కు చేయనున్నారు. ఇందు కోసం ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పాత వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు.

Published : 31 Jan 2023 01:19 IST

నోయిడా: నోయిడా (Noida)లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు లక్షకు పైగా కాలం చెల్లిన వాహనాలను (Old Vehicles) ఫిబ్రవరి 1 తేదీ నుంచి అధికారులు సీజ్‌ చేయనున్నారు. ఇందులో కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్ NCR‌) పరిధిలో కాలుష్య తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌సీఆర్‌ పరిధిలో పాత వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దని ఆదేశించింది. అటు కాలం చెల్లిన వాహనాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తుక్కు పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో నోయిడా అధికారులు చర్యలు ప్రారంభించారు.

గతేడాది అక్టోబరు నుంచి 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌లో 1,19,612 కార్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, పోలీసు కమిషనరేట్‌, జిల్లా కోర్టు, ట్రేడ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌, కుటుంబ సంక్షేమ శాఖ వంటి ప్రభుత్వ విభాగాలకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. రెండు నెలల కిందటే ఆ వాహన యజమానులకు నోయిడా ఆర్టీఓ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఆ పాత కార్లను అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సీజ్‌ చేసిన కార్లను డంపింగ్‌ పార్క్‌లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పాత కార్ల (Old Cars)ను తుక్కుగా మార్చడం లేదా నిరభ్యంతర పత్రంతో మరో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అనుమతులు జారీ చేయడం వంటివి చేయనున్నట్లు నోయిడా అధికారులు వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో 34 జిల్లాల్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉంది. నోయిడాలోని పాత వాహనాలను అక్కడ వినియోగించుకునేందుకు అనుమతులు కల్పిస్తున్నాయి. అయితే, ఆ జిల్లాల్లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని