టూల్‌కిట్‌ కేసు: మరో ఇద్దరిపై అరెస్టు వారెంటు!

గ్రెటా థన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేశారు. పర్యావరణ ప్రేమికురాలు గ్రెటాథన్‌బర్గ్‌తో టూల్‌కిట్‌ పంచుకున్నారనే

Published : 15 Feb 2021 13:42 IST

దిల్లీ: గ్రెటా థన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలపై దిల్లీ పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేశారు. పర్యావరణ ప్రేమికురాలు గ్రెటాథన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్’ ట్వీట్‌ చేసిన వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్‌, శంతనులపై పోలీసుల వినతి మేరకు దిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. అయితే, ఇద్దరిలో నికితా జాకబ్‌ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం నుంచి అందిన సమాచారం ప్రకారం.. ‘ఫిబ్రవరి 11న నికితా జాకబ్‌ ఇంటికి ప్రత్యేక బృందం వెళ్లింది. సాయంత్రం వేళ కావడంతో ఆమెను అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. అప్పుడు పలు పత్రాలపై సంతకం చేసిన అనంతరం.. తాను విచారణలో పాల్గొంటానని నికిత అధికారులకు చెప్పారు. కానీ, ఆ తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు’ అని పోలీసులు తెలిపారు. 

‘టూల్‌కిట్‌’ కేసులో భాగంగా ఇప్పటికే ఆదివారం బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ టూల్‌కిట్‌ను ఆమె గ్రెటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఐదురోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఆ టూల్‌కిట్‌ను తాను తయారుచేయలేదని దిశ కన్నీరు పెట్టుకున్నారు. కాగా, ఆమె అరెస్టును సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా ఖండించింది. తక్షణం ఆమెను విడుదల చేయాలని డిమాండు చేసింది. 

స్వీడన్‌కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్‌ షేర్‌ చేయడంతో ఈ టూల్‌కిట్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న వివిధ మార్గాలను సూచిస్తూ గూగుల్‌ డాక్యూమెంట్‌ సృష్టించారు. దీనికి టూల్‌కిట్‌గా నామకరణం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్‌ వేర్పాటువాదులే దీన్ని రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ టూల్‌కిట్‌కు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై దిల్లీ పోలీసులు దేశద్రోహం, ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

ఇదీచదవండి

థన్‌బర్గ్‌ టూల్‌కిట్‌ కేసులో తొలి అరెస్టు

పర్యావరణ ఉద్యమకారిణి దిశ అరెస్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని