Nithyananda: నిత్యానందకు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు (Nithyananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ అయింది. ....

Published : 20 Aug 2022 01:29 IST

బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు (Nithyananda) నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ అయింది. 2010లో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ వారెంట్‌ జారీ చేసింది. అయితే, కాలపరిమితి లేని నాన్‌బెయిలబుల్‌ మాదిరి ఓపెన్‌-ఎండెడ్‌ వారెంట్‌ను కోర్టు గతంలోనే జారీ చేసింది. అత్యాచార కేసులో విచారణకు హాజరు కావాలంటూ గతంలో వారెంట్‌ జారీ చేసినప్పటికీ ఆయన ఆచూకీని మాత్రం పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. 

నిత్యానందపై (Nithyananda) నమోదైన అత్యాచార కేసుకు సంబంధించి విచారణ గతంలోనే మొదలయ్యింది. ఇప్పటివరకు ముగ్గురు సాక్షులను కూడా న్యాయస్థానం విచారించింది. అయితే, నిందితుడు హాజరు కాకపోవడంతో గత మూడేళ్లుగా ఈ కేసు విచారణ నిలిచిపోయింది. 2019 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన సమన్లకు నిత్యానంద స్పందించకపోవడంతో సెప్టెంబర్‌ 23లోగా కోర్టు ముందు హాజరు కావాలంటూ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2010లో ఆయనపై అత్యాచార కేసు నమోదదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిత్యానంద స్వామి, తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం నిత్యానంద దేశం నుంచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ లెనిన్‌ 2020లో కోర్టును ఆశ్రయించడంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం రద్దు చేసింది.

ఇదిలాఉంటే, దేశం నుంచి పారిపోయిన నిత్యానంద ‘కైలాస’ అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కైలాస అనే ప్రదేశం ఎక్కడ ఉందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఓ రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈక్వెడార్‌ సమీపంలో తాను ఓ చిన్న దీవిని కొనుగోలు చేశానని, దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు నిత్యానంద ఆ వీడియోలో చెప్పాడు. ఈ దీవిని ప్రత్యేక హిందూ దేశంగా గుర్తించాలని పేర్కొన్నాడు. అయితే, ఈ వార్తలను ఈక్వెడార్‌ కొట్టిపారేసింది. అంతేగాక నిత్యానంద తమ దేశంలో ఆశ్రయం కోరినట్లు వస్తున్న వార్తలను కూడా తోసిపుచ్చింది. నిత్యానంద తమ దేశంలో లేడని ఈక్వెడార్‌ అప్పట్లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని