Norovirus: కేరళలో నోరోవైరస్‌ కలవరం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

కేరళ తిరువనంతపురంలో తాజాగా నోరోవైరస్‌ (Norovirus) వ్యాప్తి కలకలం రేపుతోంది. నోరోవైరస్‌ కేసులను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

Published : 06 Jun 2022 18:03 IST

పూర్తి నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: ఇప్పటికే కరోనాతో సతమతమవుతోన్న ప్రజలకు కొత్త వైరస్‌లు పెను ముప్పుగా తయారవుతున్నాయి. కేరళ తిరువనంతపురంలో తాజాగా నోరోవైరస్‌ (Norovirus) వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కలుషిత నీరు, ఆహారం వల్ల అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు.. పరిస్థితులను సమీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు దేశంలో నోరోవైరస్‌ మరోసారి వెలుగు చూడడంతో అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం.. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘ఇద్దరు విద్యార్థుల్లో నోరోవైరస్‌ గుర్తించాం. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలి’ అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారుల్లో కొందరు ఫుడ్‌ పాయిజన్‌ బారినపడ్డారు. వారి నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షించగా.. ఇద్దరిలో నోరోవైరస్‌ నిర్ధారణ అయ్యింది. గతేడాది కూడా కేరళలో వందల సంఖ్యలో నోరోవైరస్‌ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.

ఏమిటీ నోరోవైరస్‌..?

వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న నోరోవైరస్‌ ఒక వైరల్‌ వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కనిపించే ఈ వైరల్‌ వ్యాధి అన్ని వయస్సుల వారికి సోకుతుంది. కలుషితమైన ఆహారం, నీటి వల్ల మన శరీరంలోకి వైరస్‌ ప్రవేశిస్తుంది. దీన్ని స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు. డయేరియాకు కారణమయ్యే రోటావైరస్‌ మాదిరిగా ఉండే ఈ నోరోవైరస్‌ను నివారణతోపాటు నయం కూడా చేయవచ్చు. కలుషిత ఆహారం, నీరు తీసుకున్నా లేదా వైరస్‌ సోకిన ఉపరితలాన్ని ముట్టుకొని నోటిని తాకడం ద్వారా నోరోవైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరోవైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు మొదలై మూడు రోజుల వరకు ఉంటాయి.

లక్షణాలు..

ఈ వైరస్‌ సోకినవారిలో వాంతులు, విరేచనాలు, వికారం, కడుపునొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటితోపాటు జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి దుష్ర్పభావాలు ఉంటాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు బాధితుల శరీరంలో ద్రవాలు కోల్పోయి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తుంది. అందుకే బాధితులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.

చికిత్స ఏమిటి..?

ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నప్పటికీ దాదాపు 92శాతం రోగులు సాధారణంగా కోలుకుంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి వైరస్‌ సోకితే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అటువంటివారు వైద్యుల్ని సంప్రదించడం, అవసరమైతే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మూడు రోజుల్లో దీన్నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మలంలో దాని ఆనవాళ్లు కొన్నిరోజుల పాటు ఉంటాయన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రతే ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే వండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా లక్షణాలు గుర్తించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలి. లక్షణాలు తగ్గినా.. మరో రెండు రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 68కోట్ల నోరోవైరస్‌ కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో 20కోట్ల కేసులు కేవలం ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఉంటున్నాయి. గతేడాది (2021) జూన్‌ నెలలో కేరళలో అలప్పుజలో తొలి నోరోవైరస్‌ కేసు బయటపడింది. అక్కడ స్థానికంగా దాదాపు నెలన్నర పాటు ఈ వైరస్‌ విజృంభణ కొనసాగగా.. మొత్తం 950 కేసులు నమోదయ్యాయి. కలుషిత నీటి వల్లే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అప్పట్లో గుర్తించారు. తాజాగా కలుషిత ఆహారం వల్ల ఇద్దరు చిన్నారులకు వైరస్‌ సోకినట్లు కేరళ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని