Assembly elections: 3 రాష్ట్రాల్లో ఎన్నికలకు మోగిన నగారా.. ఎన్నికల తేదీలివే..

దేశంలో మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేసింది.

Updated : 18 Jan 2023 15:38 IST

దిల్లీ: కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ మార్చితో గడువు ముగియనున్న మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్‌ ప్రకటించింది. త్రిపుర (Tripura)లో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరగనుండగా.. మేఘాలయ (Meghalaya), నాగాలాండ్‌ (Nagaland)లలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. మార్చి 2న  ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నాగాలాండ్‌ అసెంబ్లీ గడువు మార్చి 12తో పూర్తి కానుండగా.. మేఘాలయలో మార్చి 15, త్రిపురలో మార్చి 22తో శాసనసభలకు గడువు ముగియనుంది.  

మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తంగా 180స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 9125 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 80శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనేనని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 70శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాజపా అధికారంలో ఉంది. త్రిపుర (Tripura)లో మాణిక్‌ సాహా నేతృత్వంలోని భాజపా (BJP) సర్కారు ఉండగా.. మేఘాలయ (Meghalaya), నాగాలాండ్‌ (Nagaland)లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది.

ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ తర్వాత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాలు ఈ ఏడాదిలోనే ముగియనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు