Published : 13 Jan 2021 13:11 IST

కిమ్‌ నోట అదే ప్రమాదకర మాట!

ప్యాంగ్యాంగ్‌: ప్రమాదకర ఆయుధాలతో పరాచకాలాడే ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నోట మరోసారి ప్రమాదకర మాట వెలువడింది. ఎప్పటిలాగే తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటామని తెలిపారు. ఈ మేరకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. అధికార వర్కర్స్​పార్టీ ముగింపు సమావేశం సందర్భంగా కిమ్‌ మరోసారి బుధవారం అణ్వాయుధాలపై మాట్లాడారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరాన్ని కిమ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తమ దేశ అణ్వాయుధ నిరోధక శక్తిని పెంపొందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఉద్ఘాటించారు. ఎనిమిది రోజుల పాటు సాగిన సమావేశం మంగళవారం ముగిసింది. తన తొమ్మిదేళ్ల పాలనలో అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నామని కిమ్‌ గుర్తుచేసుకున్నారు​. మహమ్మారితో సరిహద్దుల మూసివేత, వరదలు, తుపాన్ల కారణంగా పంట నష్టంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. దీనికి అమెరికా ఆంక్షలు తోడవడం దేశాన్ని మరింత కుంగదీసిందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రసాయన, లోహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ దక్షిణ కొరియాపై నిప్పులు చెరిగారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఇటీవల సైనిక కవాతు​నిర్వహించారని దక్షిణ కొరియా సైన్యం పేర్కొనటాన్ని తప్పుపట్టారు. రహస్యంగా ఇతర దేశాల విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం.. తన ప్రత్యర్థి పట్ల దక్షిణ కొరియా ‘శత్రు విధానాన్ని’ అవలంబిస్తున్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎవరినీ లక్ష్యంగా చేసుకుని సైనిక ప్రదర్శన జరగలేదని.. అది సాధారణ మిలిటరీ పరేడేనని చెప్పుకొచ్చారు. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ద.కొరియా ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తోందని ప్రశ్నించారు.

ఇవీ చదవండి...

మాకు అమెరికాయే అతిపెద్ద శత్రువు: కిమ్‌

అధికార పార్టీ సెక్రటరీగా కిమ్‌: విషయమేంటంటే..

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని