Corona: మా దేశంలో ఒక్కకేసు కూడా లేదు..!

ప్రపంచమంతా ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఉత్తరకొరియా దేశంలో ఆ వైరస్ ఆనవాలే లేదట! ఇదే విషయాన్ని ఆ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా వెల్లడించింది....

Updated : 22 Jun 2021 17:41 IST

ఆరోగ్య సంస్థకు నివేదించిన ఉత్తరకొరియా

సియోల్‌: ప్రపంచమంతా ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఉత్తరకొరియా దేశంలో ఆ వైరస్ ఆనవాలే లేదట! ఇదే విషయాన్ని ఆ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా వెల్లడించింది. జూన్ 10 నాటికి తమ దేశంలో 30వేలమంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించినట్లు సంస్థకు నివేదించింది. అయితే ఆ నిర్ధారణ పరీక్షల్లో ఒక్కరికి కూడా కరోనా సోకినట్లు వెల్లడికాలేదని తెలిపింది. 

మంగళవారం ఆరోగ్యసంస్థ తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఉత్తర కొరియాలో జూన్ 4 నుంచి 10 వరకు 733 మందికి పరీక్షలు నిర్వహించగా..149 మందిలో ఇన్‌ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులు మాత్రమే బయటపడినట్లు పేర్కొంది. ఆ దేశంలో ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా పుట్టిల్లుగా భావిస్తోన్న చైనాతో సరిహద్దులు పంచుకోవడంతో పాటు, ఆ దేశ దిగుమతులపైనే అది నెట్టుకొస్తోంది. వైద్యసదుపాయాలు అంతంతమాత్రమే. అలాంటిది అక్కడ ఒక్కకేసు కూడా వెలుగుచూడకపోవడం ప్రపంచ వింతేనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

కరోనా వైరస్ కట్టడికి ఆ దేశం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. సరిహద్దులను మూసివేసింది. చైనాతో దిగుమతులను నియంత్రించింది. ఇవి చాలదన్నట్టు ఆ దేశంలో సంభవించిన తుపాను, వరదలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓవైపు కొవిడ్ ఆంక్షలు, మరోవైపు ప్రకృతి ప్రకోపం ఆ దేశంలో తీవ్ర ఆహార కొరతకు దారితీసింది. దీనిపై ఆ దేశాధినేత కిమ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు