
సైబర్ మోసాలతో ‘అణు’సంపద
ఉత్తరకొరియా దుస్సాహసం.. ఆన్లైన్లో దోపిడీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచమంతా ఓ దారైతే.. తనదో దారి అన్నట్లు ఉంటుంది ఉత్తరకొరియా వ్యవహారం. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అణు పరీక్షలు చేసి అగ్రరాజ్యం అమెరికాను భయపెట్టాలని చూస్తోన్న కిమ్ రాజ్యం.. ఇప్పుడు కరోనాతో కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అందుకేనేమో ఆన్లైన్లో దోపిడీకి దిగింది. సైబర్ నేరాలకు పాల్పడుతూ 300 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించింది. ఆ నిధులతో తన అణ్వాయుధాలు, క్షిపణులను ఆధునీకరిస్తోందట. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ రహస్య నివేదిక ద్వారా వెల్లడైంది.
ఈశాన్య ఆసియా దేశాలపై ఆంక్షలను పర్యవేక్షించిన ఐరాస నిపుణుల కమిటీ ఒకటి ఆ నివేదికను సోమవారం భద్రతా మండలి సభ్యులకు పంపింది. 2019 నుంచి 2020 నవంబరు మధ్య ఉత్తర కొరియా హ్యాకర్లు పలుమార్లు సైబర్ దాడులు జరిపి 316.4 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని దోచుకున్నట్లు ఈ కమిటీ తమ నివేదికలో పేర్కొన్నట్లు భద్రతా మండలిలోని విశ్వసనీయ వర్గాలు బహిర్గతం చేశాయి. ఉత్తరకొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాల కోసం ఆ దేశ హ్యాకర్లు.. ఆర్థిక సంస్థలు, వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజ్ హౌస్‌లపై దాడి చేసి డబ్బు దొంగలించాయని నివేదిక తెలిపింది. సైబర్ దాడులకు పాల్పడిన హ్యాకర్లకు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో సంబంధాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. ఇటీవల ఆ దేశంలో జరిగిన మిలిటరీ పరేడ్‌లో ఆధునీకరించిన తమ ఆయుధ సంపత్తిని ఉత్తరకొరియా ప్రదర్శించినట్లు పేర్కొంది.
నిజానికి ఉత్తరకొరియా అణ్వాయుధ ప్రయోగాలు చేయకుండా ఐరాస ఆంక్షలు ఉన్నాయి. 2006లో తొలిసారిగా అణు పరికరాన్ని ప్రయోగించినప్పటి నుంచి ఆ దేశంపై ఐరాస కఠిన ఆంక్షలు విధించింది. అణు పరీక్షలు చేయకుండా ఉత్తరకొరియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చాలా ఎగుమతులను నిషేధించింది. దిగుమతులను కూడా పరిమితం చేసింది. అయినప్పటికీ ఆ ఆంక్షలను బేఖాతరు చేస్తూ కిమ్ రాజ్యం తన అణు సంపత్తిని పెంచుకుంటోందని పలుమార్లు బహిర్గతమైంది. ఇక ఎగుమతులు లేకపోవడంతో ఆర్థికంగా పుంజుకోవడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తాజాగా రుజువైంది.
అమెరికాను అడ్డుకునేందుకేనా..
2017లో ఉత్తరకొరియా థర్మోన్యూక్లియర్ వార్‌హెడ్‌తో పాటు కొన్ని క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకునేలా వీటిని రూపొందించినట్లు అప్పట్లో కిమ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి 2019లో ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు సమావేశమయ్యారు. అయితే కిమ్ డిమాండ్లను అప్పటి అగ్రరాజ్యాధినేత ట్రంప్ తిరస్కరించడంతో విఫలమయ్యాయి. ఇటీవల ఉత్తరకొరియాలో జరిగిన రాజకీయ సమావేశంలో కిమ్.. మరోసారి అణ్వాయుధాల గురించి నొక్కిచెప్పినట్లు తెలిసింది. అణు కార్యక్రమాల కోసం అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆర్థిక సంక్షోభంలో..
గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఉత్తరకొరియా బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. సరిహద్దులు మూసేసి సరకు రవాణాను నిలిపివేసింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో నిధుల కోసం సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.