Tawang Sector: ఇది 1962 కాదు.. గుర్తుపెట్టుకోండి!

చైనా దుందుడుకు స్వభావంపై అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే భారత్‌ సేనలు గట్టిగా బుద్ధి చెబుతాయని హెచ్చరించారు.

Published : 13 Dec 2022 19:05 IST

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal pradesh)లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఈ నెల 9న భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ (pema khandu) స్పందించారు. చైనా(China) దుందుడుకు తనాన్ని భారత్‌ సేనలు(Indian Army) సమర్థంగా తిప్పికొట్టాయన్నారు. ఇది 1962 కాదని ఆ దేశం గుర్తుంచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారత సైనికులు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. ‘‘ఘర్షణ చోటు చేసుకున్న తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగట్సే నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఏటా యాంగట్సే సరిహద్దులో ఉన్న జవాన్లను, సమీప గ్రామాల ప్రజలను కలుస్తుంటాను. వారి బాగోగులు అడిగి తెలుసుకుంటాను. 1962 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. మా ధీర సైనికులు సరైన బుద్ధి చెబుతారు’’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇవాళ ఉదయం కూడా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన ఘర్షణపై పార్లమెంట్‌లో ప్రకటన విడుదల చేశారు. దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా(China) బలగాల దుశ్చర్యను భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయని అన్నారు. జూన్‌ 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్- చైనా బలగాలు తీవ్రస్థాయిలో ఘర్షణ పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి ఘటనలో కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.  ఆ తర్వాత వివిధ దశల్లో కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన తర్వాత యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిబంధనపై ఇరు దేశాలను తమ బలగాలను వెనక్కి తీసుకున్నా, పరిస్థితులు నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నాయి. తాజాగా తవాంగ్‌ సెక్టార్‌లో మరోసారి ఘర్షణకు దిగడం చైనా దుందుడుకుతనానికి అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని