Corona: ‘భయపడొద్దు.. కేసులు పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరికలు తక్కువే’

దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరేవారి రేటు తక్కువగానే ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ ....

Published : 19 Apr 2022 02:49 IST

దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరేవారి రేటు తక్కువగానే ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దిల్లీలో పరిస్థితిని తమ ప్రభుత్వం గమనిస్తోందని చెప్పారు. మాస్క్‌ ధరించకపోతే జరిమానాను ఇటీవల ఉపసంహరించుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మాస్కులు ధరించని వారికి జరిమానాను మళ్లీ విధించే అంశంపై బుధవారం జరిగే దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (డీడీఎంఏ) సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

‘‘దిల్లీలో కొవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కాని ఇప్పటికే మనం 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దిల్లీవాసులు కొవిడ్‌ బారిన పడినవారే. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యా పెద్దగా ఏమీ లేదు. అందువల్ల ఈ పరిస్థితితో భయం అవసరంలేదు. దిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని సత్యేందర్‌ జైన్‌ అన్నారు. దిల్లీలోని పిల్లల్లో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరగడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఫలానా పాఠశాలలో విద్యార్థి/ ఉపాధ్యాయుడికి గనక కొవిడ్‌ సోకితే నిర్దిష్టంగా ఆ పాఠశాలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. దిల్లీలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 517 కొత్త కేసులు రాగా.. క్రితం రోజుతో పోలిస్తే 56 కేసులు అధికంగా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని