జీఎస్టీలోకి పెట్రోల్‌.. పదేళ్ల వరకు కష్టమే!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ ఈ డిమాండ్‌.........

Published : 24 Mar 2021 17:14 IST

భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ ఈ డిమాండ్‌ ముందుకొస్తున్నా ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు మాత్రం ముందుకు వేయడం లేదు. అయితే, రాష్ట్రాలు తమ ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవని భాజపా రాజ్యసభ సభ్యుడు, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ అన్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు కలిపి సుమారు ఏటా రూ.2లక్షల కోట్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశముంది, కాబట్టి రాబోయే 8-10 ఏళ్లు వరకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కష్టమేనని చెప్పారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు.

‘‘పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం రాబోయే 8-10 ఏళ్లకు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఏటా రూ.2లక్షల కోట్ల మేర (అన్ని రాష్ట్రాలు కలిపి) ఆదాయం కోల్పోవడానికి సిద్ధంగా లేవు. కేంద్రం, రాష్ట్రాలు కలిపి చమురు ఉత్పత్తులపై  రూ.5 లక్షల కోట్లు పన్ను ఆదాయం పొందుతున్నాయి. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే జీఎస్టీలో అత్యధికంగా ఉన్న 28 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలి. అదే గనుక జరిగితే రూ.2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల మేర కేంద్ర- రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు పెట్రోల్‌ లేదా డీజిల్‌ ధర రూ.100 అనుకుంటే.. రూ.60 పన్నుగా ఉంటోంది. అందులో రూ.35 కేంద్రం, రూ.25 రాష్ట్రాలు పన్ను రూపంలో వసూలు చేస్తున్నాయి. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు మళ్లీ 42 శాతం వెళుతోంది’’ అని మోదీ వివరించారు. అయినా వసూలైన పన్ను మొత్తం ప్రభుత్వ ఖజానాకే వెళుతోందని, ఆ మొత్తంతోనే విద్యుత్‌, నల్లా వంటి సంక్షేమ పథకాలు అమలౌతున్నాయని చెప్పారు. అదే లేకుంటే వీటి పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందని వివరించారు. ‘‘కొందరు దీన్ని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అని విమర్శిస్తుంటారు. కానీ ఏ రాష్ట్రమూ ఈ ట్యాక్స్‌ను వ్యతిరేకించలేదు. కావాలంటే జీఎస్టీ కౌన్సిల్‌ సమమావేశం ప్రొసీడింగ్స్‌ను పరిశీలించుకోవచ్చు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికే జీఎస్టీని అమలు చేయగలిగే సత్తా ఉంది’’ అని సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని