Seat belts: సీట్‌బెల్ట్‌ లేని ప్రయాణం.. ఏడాదిలో 16,397 మృతి!

హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ లేని ప్రయాణాల కారణంగా గత సంవత్సరంలో మరణించిన, గాయపడిన వారి గణాంకాలను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదలచేసింది.

Published : 29 Dec 2022 23:11 IST

దిల్లీ: రోడ్డు ప్రయాణంలో హెల్మెట్‌, సీటు బెల్టుల ధరించాలని ఎంత హెచ్చరిస్తున్నా చాలా మంది వాటి ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. వీటి పట్ల నిర్లక్ష్యం కారణంగానే ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 2021లో 16,397 మంది మృత్యువాత పడినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 8,438 మంది ఆయా వాహనాల డ్రైవర్లు కాగా.. 7,959 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘భారత్‌ రోడ్డు ప్రమాదాల జాబితా- 2021’ పేరిట గణాంకాలను గురువారం రోడ్డు రవాణా, మంత్రిత్వ శాఖ (MoRTH) వెల్లడించింది. గత ఏడాదిలో హెల్మెట్‌ ధరించని కారణంగా 46,593 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని అందులో పేర్కొంది. చనిపోయిన వారిలో 32,877 మంది వాహన చోదకులు, 13,716 ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. 

2021లో మెత్తంలో 4,12,432 రోడ్డుప్రమాదాలు జరిగాయని రహదారి మంత్రిత్వ శాఖ తెలిపింది. అందులో 1,53,972 మంది మరణించగా.. 3,84,448 మంది గాయపడ్డారని తెలిపింది. హెల్మెట్‌ ధరించకపోవటంతో 93,763 గాయాలపాలయ్యారని, సీట్‌బెల్ట్‌ ధరించని కారణంగా 39,231 మంది గాయపడినట్లు పేర్కొంది. రహదారుల శాఖ ద్విచక్రవాహనాలను నడిపే సమయంలో హెల్మెట్‌ ధరించటం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీట్‌బెల్ట్‌ ధరించకపోతే సెంటర్‌ మోటార్‌ వెహికల్‌ రూల్ ‌(CMVR) రూ.1000 జరిమానా పడుతుంది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ ఛైర్మెన్‌ సైరస్‌ మిస్త్రీ మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో ఆయన కూడా సీట్‌బెల్టు ధరించలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని