భవిష్యత్తులో..సాధారణ జలుబుగానే కరోనా!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది.

Published : 14 Jan 2021 01:26 IST

అంచనా వేసిన అమెరికా శాస్త్రవేత్తలు

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో ఓ సాధారణ జలుబు మాదిరిగానే మారనుందని తాజా పరిశోధన వెల్లడించింది. ప్రస్తుతం మహమ్మారిగా ఉన్న కరోనా వైరస్‌, ఎండమిక్‌గా మారిన తర్వాత తీవ్రత తగ్గవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వైరస్‌ బారినపడుతోన్న చిన్నారులకు భవిష్యత్తులో ఇది సాధారణ జలుబుగానే మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సార్స్‌-కోవ్‌-1 తోపాటు మరో నాలుగు కరోనా వైరస్‌ రకాలపై జరిపిన ఈ పరిశోధన పత్రం తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

సాధారణ ప్రజల్లో ఇది విస్తృతంగా వ్యాపించిన తర్వాత ఇది స్థానిక వ్యాధిగా మారే అవకాశం ఉన్నట్లు అమెరికా పరిశోధకులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ గ్రూపు వైరస్‌లకు సంబంధించిన వ్యాధినిరోధక చికిత్సా విధానం, సాంక్రమిక వ్యాధుల అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుతం విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ తీవ్రత తీరును శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణ జలుబుకు కారణమయ్యే నాలుగు రకాల కరోనా వైరస్‌లు ప్రస్తుతం వ్యాప్తిలో ఎంతోకాలంగా ఉన్నాయని, ప్రతిఒక్కరు వారి చిన్నతనంలోనే వీటి బారినపడి ఉంటారని తెలిపారు.

చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వారిలో రోగనిరోధకత లభిస్తుందని, ఇవి భవిష్యత్తులో వచ్చే తీవ్ర రోగాలను ఎదుర్కోవడంలో దోహదపడుతాయని అమెరికాలో ఎమోరీ యూనివర్సిటీకి చెందిన జెన్నీ లావైన్‌ వెల్లడించారు. అయితే, అప్పుడప్పుడు సంభవించే రీ ఇన్ఫెక్షన్లను మాత్రం నియంత్రించలేవని తెలిపారు. 3 నుంచి 5ఏళ్లలోపు చిన్నారుల్లో సార్స్-కోవ్‌-2 తొలుత సంక్రమించినప్పుడు ఓ వ్యాధిలో కనిపించినప్పటికీ, తర్వాత దాని తీవ్రత తగ్గి స్వల్ప వ్యాధిలాగే మారుతుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పెద్దవారికి వైరస్‌ సోకినప్పుడు తీవ్రతను తగ్గించడంలో వారి చిన్నతనంలో వైరస్‌ వల్ల పొందిన రోగనిరోధకత రక్షణ కలిపిస్తుందని అంచనా వేశారు. అయితే, ఇది జరగడానికి ఎంతకాలం పడుతుందనే విషయం మాత్రం వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సిన్‌ల వల్ల పొందే రోగనిరోధకతపైన ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చేపడుతోన్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడగలమని అమెరికా శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇవీ చదవండి..
భారత్‌: 100దాటిన కొత్తరకం కేసులు
అది నిజంగా చైనా టీకానే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని