‘వాసన పరీక్ష’తో కొవిడ్‌ గుర్తింపు..!

వాసన కోల్పోయే లక్షణమున్న కొవిడ్‌-19తో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఓ కిట్‌ను రూపొందించారు.

Published : 30 Apr 2021 20:27 IST

కిట్‌ అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌: కరోనా వైరస్‌ను సోకిన కొందరిలోనే వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తున్నాయి. మరికొందరిలో లక్షణాలు కనిపించనప్పటికీ వాసన కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాసన కోల్పోయే లక్షణమున్న కొవిడ్‌-19తో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఓ కిట్‌ను రూపొందించారు. దీని ద్వారా పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులతో పాటు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్క్రాచ్‌ అండ్‌ స్నిఫ్‌ విధానంలో పరీక్షించే సాధనాలతో పోలిస్తే ఈ మాత్ర ఆధారిత వాసన పరీక్ష ఎంతో తేలికని పరిశోధకులు స్పష్టం చేశారు.

కరోనాతోపాటు పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌ వంటి కొన్ని రకాల నాడీకణ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వాసన కోల్పోయే లక్షణం ఉన్నట్లు నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు బ్రిటన్‌లోని క్వీన్స్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు ఓ పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా ఓ రకమైన నూనె నుంచి తయారు చేసిన క్యాప్సూల్స్‌, ఓ పలకపై రెండు స్ట్రిప్స్‌ ఉండే ఓ కిట్‌ను రూపొందించారు. వాసన కోల్పోతున్న  వ్యక్తి ఆ మాత్రలను చేతితో చూర్ణం చేసి స్ట్రిప్‌పై వేసి వాసన చూడాలి. దానిని పీల్చి వాసనను గుర్తించే సామర్థ్యాన్ని బట్టి స్కోర్‌ నమోదు చేస్తారు. మాత్రల ఆధారంగా జరిపే ఈ పరీక్ష ద్వారా వాసన కోల్పోయే లక్షణమున్న అన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చని క్వీన్స్‌ మేరీస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు చెందిన పరిశోధకులు అహ్మద్‌ ఇస్మాయిల్‌ పేర్కొన్నారు. పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు వాసన కోల్పోయే లక్షణమున్న కరోనా వైరస్‌ను గుర్తించడంలో ఎంతో దోహదపడుతుందన్నారు.

చిన్నారులకు స్వాబ్‌ నమూనాను తీసుకునే సమయంలో వారు తీవ్ర భయానికి గురవుతారు. అలాంటి నేపథ్యంలో కేవలం వారి ఇంటిలోనే ఈ పరీక్ష సహాయంతో తేలికగా వైరస్‌ నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో జరిపిన ఓ అధ్యయనంలో ఎనిమిది మంది పార్కిన్‌సన్‌ రోగుల్లో ఈ పరీక్ష ద్వారా వాసనను గుర్తించారని..ఇది ఎంతో తేలికైనదని వారు చెప్పినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్క్రాచ్‌ అండ్‌ స్నిఫ్‌ విధానంలో పరీక్షించే సాధనాలతో పోలిస్తే ఈ మాత్ర ఆధారిత పరీక్ష ఎంతో తేలిక అనే విషయం తాజా అధ్యయనంలో తేలిందని పరిశోధకులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని