Ajit Doval: జాతీయ భద్రత సలహాదారుగా అజీత్‌ డోభాల్‌ పునర్నియామకం

జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజీత్‌ డోభాల్‌ను కేంద్రప్రభుత్వం గురువారం మరోసారి నియమించింది.

Published : 14 Jun 2024 05:48 IST

ప్రధాని ముఖ్యకార్యదర్శిగా పి.కె.మిశ్ర కొనసాగింపు
కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ వెల్లడి

దిల్లీ: జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజీత్‌ డోభాల్‌ను కేంద్రప్రభుత్వం గురువారం మరోసారి నియమించింది. ‘ఎన్‌ఎస్‌ఏ’గా ఆయన నియామకానికి క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. పదవీకాలంలో ఆయన క్యాబినెట్‌ మంత్రి హోదాతో వ్యవహరిస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన సమయంలో 2014 మే 30న డోభాల్‌ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కె.మిశ్రను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ.. అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు క్యాబినెట్‌ మంత్రి హోదాను కేటాయించారు. ఈ నెల 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డోభాల్‌ ఎన్‌ఎస్‌ఏగా ఉంటారని, పి.కె.మిశ్ర ప్రధాని ముఖ్యకార్యదర్శిగా ఉంటారని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ పేర్కొంది. వీరితోపాటు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులైన అమిత్‌ ఖేడా, తరణ్‌ కపూర్‌లను ప్రధాని సలహాదారులుగా పునర్నియమించారు. ఈ నెల 10 నుంచి రెండేళ్ల పాటు వారు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఝార్ఖండ్‌ కేడర్, 1995 బ్యాచ్‌కు చెందిన ఖేడా 2021 నుంచి..హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్, 1987 బ్యాచ్‌కు చెందిన కపూర్‌ 2022 నుంచి మోదీ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని