NEET UG: ఈ ఏడాది నీట్‌ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు!: ఎన్‌టీఏ

NEET UG: ఈ ఏడాది విడుదల చేసిన నీట్ ఫలితాల్లో సగటు మార్కులకు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని ఎన్‌టీఏ వెల్లడించినట్లు సమాచారం.

Published : 10 Jul 2024 15:30 IST

దిల్లీ: ఈ ఏడాది విడుదలైన నీట్‌ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాల్లో అసాధారణమైన వ్యత్యాసం ఏమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌ పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

2020 నుంచి 2024 వరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను విశ్లేషించగా.. సగటు స్కోర్‌కు అనుగుణంగానే కటాఫ్‌ మార్కులు ఉన్నాయని, వాటితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్ష పోటీతత్వం, అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్‌ మార్కులు ఉంటాయని తెలిపింది. 2020లో కరోనా సమయంలో 13.6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, 720 మార్కులకు గానూ సగటు స్కోర్‌ 297.18గా ఉందని తెలిపింది. అప్పుడు జనరల్‌ కేటగిరీ కటాఫ్ 147. ప్రస్తుత ఏడాదిలో సగటు స్కోర్‌ 323.55 కాగా..క్వాలిఫైయింగ్‌ మార్కులు 164 అని కోర్టుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ఈసారి 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, ఈ స్థాయిలో హాజరు ఇదే తొలిసారి అని చెప్పింది. అలాగే పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్ద వ్యత్యాసం లేదని వెల్లడించినట్లు సమాచారం.

ప్రొబేషనరీ ఐఏఎస్‌ గొంతెమ్మ కోర్కెలు.. కన్నెర్ర చేసిన ప్రభుత్వం

నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీకైందని (NEET Paper Leak), అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. పేపర్ లీకైనమాట వాస్తమేనని స్పష్టం చేసింది. నీట్ ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. గ్రేస్‌ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష (NEET Exam) నిర్వహించి సవరించిన నీట్‌ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ విచారణ నేపథ్యంలో కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని