Vaccine for Children: 5-12 ఏళ్ల పిల్లలకు టీకా.. రేపే నిర్ణయం..!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేందుకు

Published : 28 Apr 2022 19:18 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) రేపు నిర్ణయం వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

నిపుణుల కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా 5-12 ఏళ్ల వారికి టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేడు విలేకరులతో అన్నారు. ఎన్‌టీఏజీ నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ భేటీలో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ఈ వయసు వారికి ఇచ్చేందుకు రెండు టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. 6-12 ఏళ్ల వారి కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, 5-12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్‌ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకాకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ వయసు గ్రూప్‌ పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు వైరస్‌ బారిన పడటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే టీకా కార్యక్రమాన్ని విస్తరించి 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తోంది. అర్హులైన పిల్లలందరికీ టీకాలు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని