Child Vaccine: 5-12 పిల్లలకు టీకాపై వీడని సందిగ్ధత.. తుది నిర్ణయం తీసుకోని ఎన్‌టాగి

చిన్నారులకు వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టే అంశంపై నేడు కీలక ప్రకటన వస్తుందని భావించినప్పటికీ నిపుణుల బృందం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Published : 29 Apr 2022 22:51 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసులు మరోసారి పెరుగుతున్న వేళ చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందించే విషయంపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌ల వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. అయితే, వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టే అంశంపై నేడు కీలక ప్రకటన వస్తుందని భావించినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. ఇదే విషయంపై చర్చించేందుకు నిపుణుల బృందం శుక్రవారం సమావేశమైనా అది అసంపూర్తిగానే ముగిసింది. దీంతో పిల్లలకు వ్యాక్సిన్‌ ఎప్పటినుంచి మొదలవుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఐదేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఆమోదం, విధివిధానాలను రూపొందించే అంశంపై ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగి) నేడు సమావేశమైంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రామాణిక నిర్వహణ పద్ధతుల(SoP)లపై చర్చించింది. ఈ సందర్భంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన కొవొవాక్స్‌ను 12-17ఏళ్ల వయసువారికి ఇచ్చేందుకు ఆమోదించింది. కానీ, చిన్నారుల టీకా పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదిలాఉంటే, ఐదేళ్లు పైబడిన చిన్నారులకు త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇటీవలే వెల్లడించారు. ఇదే సమయంలో భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా వినియోగానికి డీసీజీఐ ఈమధ్యే అనుమతి ఇచ్చింది. దీనితోపాటు 5-11ఏళ్ల వారికోసం బయోలాజికల్‌-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌, 12ఏళ్ల వయసుపైబడిన వారికోసం జైడస్‌ క్యాడిలా సంస్థ తయారు చేసిన జైకోవ్‌డీ వ్యాక్సిన్‌లకూ డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లపైబడిన పిల్లల టీకాపై నేడు జరిగిన ఎన్‌టాగీ సమావేశంలో స్పష్టత వస్తుందని భావించినప్పటికీ ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని