నిరసనలతో హోరెత్తిన మయన్మార్‌

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.

Published : 07 Feb 2021 17:50 IST

రోడ్లపైకి వేలాది పౌరులు, తిరిగి అందుబాటులో ఇంటర్నెట్‌

యాంగూన్‌: మయన్మార్‌, ఆ దేశ ఆర్థిక రాజధాని యాంగోన్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. తమ ప్రియతమ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌ సాన్‌ సూకీని విడుదల చేయాలని, మిలిటరీ ప్రభుత్వం గద్దె దిగాలన్న నినాదాలతో  యాంగూన్ దద్దరిల్లుతోంది. ఇక మాండలేతో మయన్మార్‌లోని పలు ఇతర నగరాలు, ప్రదేశాల్లో కూడా నిరసనలు రాజుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

యాంగోన్‌లో ప్రముఖ సులె పగోడా కేంద్రంగా అహింసాయుత ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.  ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ 1998, 2007 నాటి ప్రజా ఉద్యమాలను అప్పటి మిలిటరీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసింది.  నాటి ఘర్షణల్లో వేల మంది మరణించినట్టు వార్తలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో  ఆయా సంఘటనల పట్ల వెనుదీయకుండా వేల సంఖ్యలో కార్మిక, విద్యార్థి సంఘాలు, పౌరులు యాంగూన్‌ విశ్వవిద్యాలయం సమీపంలో సమావేశమయ్యారు . అనంతరం జాతీయ రహదారి వైపుగా సాగిన ప్రదర్శనకు.. వాహనాల డ్రైవర్లు హారన్లు మోగించి తమ మద్దతు తెలియచేశారు.

కార్చిచ్చులాగా వ్యాప్తిస్తున్న వ్యతిరేకతను అడ్డుకునేందుకు మయన్మార్‌లో ఏర్పాటైన సైనిక ప్రభుత్వం శనివారం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలను అందుబాటులో లేకుండా చేశారు. ఈ చర్యలు మానవ హక్కులకు విఘాతం కల్పించడమే అంటూ స్థానికంగా, అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదురయ్యాయి. కాగా, నేటి మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్‌ తిరిగి అందుబాటులోకి వచ్చినట్టు కొందరు వెల్లడించారు. ఇది తమ విజయమని.. ప్రదర్శకులు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిస్తున్నారు. 

ఇవీ చదవండి..

చిలీతో హింసాత్మకంగా మారిన ర్యాలీ

దిల్లీ నిరసనలు.. మరో రైతు మృతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని