Covaxin: కెనడాలో సరఫరాకు ఆక్యుజెన్‌తో ఒప్పందం!

కెనడాలో కొవాగ్జిన్‌ సరఫరా చేసేందుకు అమెరికా బయోఫార్మా సంస్థ ఆక్యుజన్‌ మార్కెటింగ్‌ హక్కులను దక్కించుకుంది.

Updated : 21 Dec 2022 14:51 IST

అమెరికాలోనూ సరఫరాకు భారత్‌ బయోటెక్‌తో పనిచేస్తోన్న Ocugen

దిల్లీ: దేశంలో విరివిగా వినియోగిస్తున్న కొవాగ్జిన్‌ టీకాను విదేశాల్లోనూ మార్కెటింగ్‌ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కెనడాలో కొవాగ్జిన్‌ సరఫరా చేసేందుకు అమెరికా బయోఫార్మా సంస్థ ఆక్యుజన్‌ మార్కెటింగ్‌ హక్కులను దక్కించుకుంది. ఇందుకోసం భారత్‌ బయోటెక్‌తో ఆక్యుజెన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కొవాగ్జిన్‌ అమ్మకాల ద్వారా 45శాతం లాభాల వాటాను ఆక్యుజెన్‌ సొంతం చేసుకోనుంది. అంధత్వం, కంటి వ్యాధులు, జీన్ థెరపీ, వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రసిద్ధి చెందిన ఆక్యుజెన్, అమెరికాలోనూ కొవాగ్జిన్‌ సరఫరాకు భారత్‌ బయోటెక్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

కొవాగ్జిన్‌ వినియోగానికి భారత్‌ బయోటెక్‌ 60 దేశాల్లో దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 13దేశాల్లో అనుమతి పొందింది. ఇందులో భాగంగా, అమెరికాలో కొవాగ్జిన్‌ ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్‌ చేసేందుకు అక్కడి బయోఫార్మా సంస్థ ఆక్యుజెన్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే, అమెరికాలో కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అక్కడి నియంత్రణ సంస్థ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో కెనడాలోనూ మార్కెటింగ్‌ చేసేందుకు ముందుకొచ్చిన ఆక్యుజెన్‌, అత్యవసర వినియోగ అనుమతికి దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది.

భారత్‌లో జరిపిన ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ సురక్షితమని తేలడంతో పాటు సమర్థత కలిగినట్లు వెల్లడైందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. అమెరికాతో పాటు కెనడా మార్కెట్‌లోకి కొవాగ్జిన్‌ తీసుకువచ్చేందుకు ఆక్యుజెన్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా రకాలను ఎదుర్కొవడంలో కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలడంతో.. రానున్న రోజుల్లో ఈ టీకా ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైందిగా మారుతుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే, కొవాగ్జిన్‌ టీకాకు ఎమర్జెన్సీ యూస్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకుంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఇప్పటికే సమర్పించింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ టీకాకు సెప్టెంబర్‌ లోపు WHO అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని