జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఎమ్మెల్యేను చితకబాదిన స్థానికులు!

లఖింపుర్​ ఖేరి దుర్ఘటనను గుర్తుచేసేలా ఒడిశాలోని ఖుర్దాలో దారుణం చోటుచేసుకుంది. చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు జన సమూహంపైకి దూసుకెళ్లింది.......

Published : 12 Mar 2022 17:54 IST

భువనేశ్వర్‌: లఖింపుర్​ ఖేరి దుర్ఘటనను గుర్తుచేసేలా ఒడిశాలోని ఖుర్దాలో దారుణం చోటుచేసుకుంది. చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు జన సమూహంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 15 మంది భాజపా కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో బానాపుర్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఆర్‌ సాహు సైతం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరిని భువనేశ్వర్​ ఎయిమ్స్​కు తరలించారు.

పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖుర్దా జిల్లాలోని బానాపుర్ బ్లాక్​ ఆఫీస్​ ముందు పార్టీల కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. ఈ సమయంలోనే బిజూ జనతా దళ్‌ (బీజేడీ) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్‌దేవ్‌ కారుతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్​దేవ్​ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో గత ఏడాది సెప్టెంబరులో జగదేవ్‌ను బీజేడీ పార్టీ సస్పెండ్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు