NFSA Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్‌ వన్‌.. మరి తెలుగు రాష్ట్రాలు!

రేషన్‌ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అమలులో ఒడిశా అగ్ర స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. తెలంగాణకు 12వ స్థానం దక్కింది...

Published : 06 Jul 2022 00:25 IST

దిల్లీ: రేషన్‌ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతాచట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అమలులో ఒడిశా దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. ఆహార భద్రత అమలుపై రాష్ట్ర మంత్రులతో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ర్యాంకుల సూచీ- 2022’ని విడుదల చేశారు. ప్రత్యేక కేటగిరి రాష్ట్రాల్లో (ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పటికీ.. సాధారణ రాష్ట్రాలతో పోటీ పడ్డాయని సూచీ తెలిపింది.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ(టీపీడీఎస్‌) కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ అమలు తీరును ఈ సూచీ లెక్కించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలూ మరింత దృష్టి సారించి మెరుగైన ర్యాంకులు పొందుతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’ లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చు. దీని కింద ఇప్పటివరకు 45 కోట్ల లావాదేవీలు జరిగాయి’ అని మంత్రి ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని