Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్‌ లేని వారికీ పరిహారం!

ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) బాధితుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వారికి కూడా పరిహారం అందిస్తామని రైల్వే శాఖ (Indian Railways) వెల్లడించింది.

Published : 05 Jun 2023 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) బాధితుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణించిన వారికి సైతం పరిహారం అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.  సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటిని అందజేస్తామని తెలిపింది. రైల్వే మంత్రి ప్రకటించినట్లుగా.. చనిపోయిన బాధిత కుటుంబీకులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.50వేల చొప్పున పరిహారం సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ‘టికెట్‌ ఉందా? లేదా? అనేది అంశంతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్క బాధితుడికీ పరిహారం అందుతుందని రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ వెల్లడించారు.

ఇప్పటివరకు 285 కేసుల్లో రూ.6.06 కోట్లు పరిహారం అందించామని రైల్వేశాఖ వెల్లడించింది. మృతిచెందిన వారిలో 31మంది కుటుంబీకులతో పాటు 83 మంది తీవ్రంగా గాయపడిన వారికి, స్వల్ప గాయాలైన మరో 259 మందికి ఇప్పటివరకు అందజేశామని పేర్కొంది. సోరో, ఖరగ్‌పుర్‌, బాలేశ్వర్‌, ఖాంటాపడా, భద్రక్‌, కటక్‌, భువనేశ్వర్‌ ప్రాంతాల్లో ఈ పరిహారం అందజేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటివరకు 200 మంది బాధితులను గుర్తించలేదని.. వారి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.

మరోవైపు, ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్క బాధితుడికి.. వారి కుటుంబీకులను గుర్తించేందుకుగాను తోడుగా ఒక సహాయకుడు ఉన్నాడని రైల్వే బోర్డు (ఆపరేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) సభ్యులు జయ వర్మ సిన్హా వివరించారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ కూడా అందుబాటులో ఉందని.. సీనియర్‌ రైల్వే అధికారులు అక్కడ సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి తమ కుటుంబీకులతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చనిపోయిన, గాయపడిన వారి కోసం వచ్చే ప్రయాణికులకు ప్రయాణ, ఇతర ఖర్చులను కూడా తామే భరిస్తామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు