Mamata Banerjee: ‘మృతుల సంఖ్యలో వాస్తవమెంత? ’

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. దీంతోపాటు వందేభారత్‌ రైళ్ల ఇంజిన్‌లు సామర్థ్యం మేర ఉన్నాయా అని ప్రశ్నించారు.

Published : 04 Jun 2023 20:00 IST

కోల్‌కతా: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident)లో ఇప్పటివరకు 275 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, రైల్వే శాఖ (Ministry of Railways) ప్రకటించిన ఈ మృతుల సంఖ్య విషయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం తమ రాష్ట్రానికే చెందిన 61 మంది మృతి చెందారని, మరో 182 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ లెక్కన.. అసలు గణాంకాలు సరైనవేనా అని ప్రశ్నించారు. దీంతోపాటు వందే భారత్‌ (Vande Bharat) రైలు ఇంజిన్లు సామర్థ్యం మేర ఉన్నాయా? అని అడిగారు. ఒడిశా ఘటన చాలా విషాదకర పరిస్థితి అయినప్పటికీ.. భాజపా తీరే తనను ఈ విధంగా మాట్లాడేలా చేసిందని మీడియాతో మమతా చెప్పారు.

తాను, నీతీశ్‌ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త సిగ్నల్ వ్యవస్థ, యాంటీ కొలిజన్ డివైజ్‌ను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. తన హయాంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు. మరి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఇంజిన్లు సామర్థ్యం మేర ఉన్నాయా? ప్రశ్నించారు. ‘వందే భారత్ పేరు బాగుంది. కానీ.. ఒక చెట్టు కొమ్మ మీద పడటంతో ఏం జరిగిందో చూశారు కదా!’ అని పూరీ- హావడా వందే భారత్ రైలును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒడిశాలోని జాజ్పుర్‌ జిల్లాలో ఇటీవల దానిపై చెట్టుకొమ్మలు విరిగిపడటంతో రైలు నిలిచిపోయింది. దీంతోపాటు లోకోపైలట్‌ క్యాబిన్‌ అద్దాలకు పగుళ్లు వచ్చాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు