నువ్వే తోశావ్‌.. కాదు నువ్వే తోశావ్‌: ఎమ్మెల్యే, మహిళా పోలీసు ఘర్షణ

ఒడిశా భాజపా ఎమ్మెల్యే, మహిళా పోలీసు అధికారిణి మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇది భాజపా(BJP),బిజూ జనతాదళ్‌(BJD) మధ్య విమర్శలకు దారితీసింది. 

Published : 16 Feb 2023 12:50 IST

దిల్లీ: ఉన్నతస్థాయి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రజాసేవకులు సహనం కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం మధ్యలో ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగకుండా ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఒడిశా( Odisha) భాజపా ఎమ్మెల్యే జయనారాయణ్‌ మిశ్రా( Jaynarayan Mishra) కాగా, మరొకరు ధనుపాలి(Dhanupali) పోలీస్‌ స్టేషన్ ఇన్‌ఛార్జి అనితా ప్రధాన్‌(Anita Pradhan). వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయంటూ భాజపా నిరసనలు చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం సంబల్‌పుర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో భాజపా నేతలు లోపలికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారని అనిత వెల్లడించారు. అప్పుడే ఎమ్మెల్యే ఎదురుపడ్డారన్నారు. ‘లంచగొండి, బందిపోటు అని ఆయన నన్ను నిందించారు. చెంప పగలగొడతానంటూ చేయి చూపించారు. అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. నా మొహంపై చేయిపెట్టి వెనక్కి నెట్టేశారు’ అంటూ ఆమె ఆరోపించారు. మరోపక్క మిశ్రా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళా కార్మికులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని తాను ముందుకు వచ్చానని చెప్పారు.

‘నేను పోలీసులపై విరుచుకుపడుతున్నానంటూ ఆమె నన్ను వెనక్కి తోశారు. కానీ, నేను ఆమెను తోయలేదు. పోలీసులపై నేను ఆరోపణలు చేయడంతో వారు నాపై కుట్ర పన్నారు. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలీదు’ అని మిశ్రా స్పందించారు. ఇక వీరిద్దరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ ఘర్షణపై నివేదిక కోరినట్లు సంబల్‌పుర్ ఎస్పీ వెల్లడించారు. మరోపక్క ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒడిశా పోలీస్‌ సర్వీస్‌ అసోసియేషన్.. డీఐజీని ఆశ్రయించారు. 

దీనిపై భాజపా స్పందించింది. ‘ఇటీవల ఓ పోలీసు అధికారి ఝార్సుగూడలో ఓ మంత్రిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఇప్పుడు ఓ మహిళా పోలీసు ప్రతిపక్ష నాయకుడిపై దురుసుగా ప్రవర్తించారు. ఒడిశాలో శాంతిభద్రతలు కరవయ్యాయి. ఆమెపై సీఎం చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది. మరోపక్క అధికార బిజూ జనతాదళ్‌(BJD)మిశ్రాను విమర్శించింది. ‘ఇలా బెదిరింపులకు దిగడం ఆయనకు పరిపాటే. ఆయనపై హత్య కేసు సహా 14 కేసులున్నాయి. జైలుకు కూడా వెళ్లివచ్చాడు’ అని విరుచుకుపడింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని