ఆస్పత్రిలో శునకానికి ఉద్యోగం.. సకల వసతులు!

కరోనా సంక్షోభంలో అత్యధికంగా శ్రమిస్తోంది.. వైద్యరంగంలో పనిచేసేవాళ్లని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది

Published : 07 Dec 2020 01:12 IST


(Photo: Shari Dunaway, MD twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభంలో అత్యధికంగా శ్రమిస్తోంది.. వైద్యరంగంలో పనిచేసేవాళ్లేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. కరోనా విషయంలోనే కాదు, సాధారణంగానే రోగులకు వైద్య సేవలు అందిస్తూ, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేక వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే, వీరి ఒత్తిడిని దూరం చేయడం కోసం యూఎస్‌లోని ఓహాయో రాష్ట్రంలో ఓ ఆస్పత్రి వినూత్న ఆలోచన చేసింది. ఫలితంగా ఓ శునకానికి ఉద్యోగం లభించింది. శునకానికి ఉద్యోగమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవండి..

స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన వెక్స్‌నర్‌ మెడికల్‌ సెంటర్‌లో షిలో అనే ఒక శునకం వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి మొత్తం తిరుగుతూ కనిపించిన వారి వద్దకెళ్లి అమాయక ముఖం చూపిస్తూ పలకరించడమే దాని పని. మనిషికి ఉండే ఒత్తిళ్లను దూరం చేయడంలో పెంపుడు జంతువులు ముఖ్య పాత్ర వహిస్తాయి. వాటితో కాసేపు సమయం గడిపితే చాలు.. ఒత్తిడి దూరమవుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆస్పత్రి యాజమాన్యం ‘స్టార్‌ ప్రోగ్రామ్‌’ కింద శునకానికి ఇటీవల ఉద్యోగమిచ్చి వైద్య సిబ్బంది ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ శునకానికి మెడలో ఐడీ కార్డు, ప్రత్యేక గది, భోజన వసతులున్నాయి. వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలు అదనం.

ఆ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ షరీ డునావే.. కొత్త ఉద్యోగంలో చేరిన షిలో గురించి వివరిస్తూ పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. లక్షకుపైగా నెటిజన్లు ఆ ట్వీట్‌ను లైక్‌ చేశారు. వేలమంది షేర్‌ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని ఇలిగన్‌ మెడికల్‌ సెంటర్‌లోనూ ఓ శునకం ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తోందట. ఆ దేశానికి చెందిన ఓ యువతి ‘మా దేశంలోనూ ఓ శునకం ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంద’ని ట్వీట్‌ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని