పండుటాకులకు దీర్ఘకాలిక వ్యాధులు

ఆరు పదుల వయసు దాటిన వారిలో 55% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.

Published : 07 Jan 2021 13:37 IST

60 ఏళ్లు దాటినవారిలో 
55% మందికి ఇదే బాధ...
ఎల్‌ఏఎస్‌ఐ వేవ్‌-1 సర్వేలో వెల్లడి

దిల్లీ: ఆరు పదుల వయసు దాటిన వారిలో 55% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 2017 ఏప్రిల్‌ నుంచి 2018 డిసెంబరు వరకూ 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టి... లాంగిట్యూడినల్‌ ఏజింగ్‌ స్టడీ ఇన్‌ ఇండియా (ఎల్‌ఏఎస్‌ఐ వేవ్‌-1) నివేదికను రూపొందించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ బుధవారం దీన్ని విడుదల చేశారు. ‘‘60 ఏళ్లు పైబడిన వారిలో 40% మంది ఏదోక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 20% మందిని మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. 27% (3.5 కోట్లు) మంది ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో సతమతమవుతున్నారు’’ అని నివేదిక పేర్కొంది. కేంద్ర మంత్రి మాట్లాడుతూ- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.6% (10.3 కోట్ల) మంది వృద్ధులు ఉన్నారని, ఏటా 3% చొప్పున వారి సంఖ్య పెరుగుతోందని, 2050 నాటికి వృద్ధుల సంఖ్య 31.9 కోట్లకు చేరనుందని చెప్పారు. వృద్ధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ సర్వే ఫలితాలు దోహదపడతాయన్నారు. ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్, హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఐరాస పాపులేషన్‌ ఫండ్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌తో కలిసి... జాతీయ వృద్ధుల ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌పీహెచ్‌సీఈ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు ఈ సర్వేను చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 72,250 మంది నుంచి వివరాలు సేకరించారు. వీరిలో 60 ఏళ్లు పైబడినవారు 31,464 మంది ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని