మండుటెండల్లో ఫించన్‌ కోసం వృద్ధురాలి అవస్థ.. చలించిపోయిన కేంద్ర మంత్రి సీతారామన్‌

ఫించన్‌ (Pension) తీసుకునేందుకు ఓ వృద్ధ మహిళ విరిగిపోయిన కుర్చీ సాయంతో ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వీడియో చూసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) స్పందించారు. 

Published : 22 Apr 2023 01:42 IST

భువనేశ్వర్‌: జీవిత చరమాంకంలో ఎటువంటి ఆసరాలేని వృద్ధులు ఎవరిపై ఆధారపడకుండా, గౌరవంగా బతికేందుకు.. ప్రభుత్వాలు వారికి వృద్ధాప్య పింఛను (Old Age Pension) అందిస్తున్నాయి. కానీ, కొందరు అధికారుల తీరుతో పింఛను తీసుకునేందుకు వృద్ధులు అవస్థలు పడుతున్నారు. తాజాగా పింఛను తీసుకునేందుకు ఓ వృద్ధురాలు పడుతున్న కష్టం చూసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) చలించిపోయారు. మానవతా ధృక్పథంతో ఆమెకు సాయం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. 

ఒడిశా(Odisha) లోని నబ్రాంగ్‌పూర్‌ జిల్లా జారిగోన్‌ ప్రాంతానికి చెందిన సూర్య హరిజన్‌ అనే 70 ఏళ్ల మహిళ పింఛను తీసుకునేందుకు బ్యాంకుకు వెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విరిగిపోయిన కుర్చీ సాయంతో కాళ్లకు చెప్పుల్లేకుండా ఎండలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళుతున్న వీడియోను చూసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ‘‘ఎస్‌బీఐ అధికారులు దీన్ని చూశారా? మానవతా ధృక్పథంతో ఆమెకు సాయం చేయండి. ఆమె నివసించే ప్రాంతంలో బ్యాంక్‌ మిత్ర లేరా?’’ అని మంత్రి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన బ్యాంక్‌ అధికారులు, సదరు మహిళకు ఇకపై ఇంటి వద్దనే పింఛను అందిస్తామని తెలిపారు. 

‘‘ మేడమ్‌, వీడియో చూసి మేము ఎంతో బాధపడుతున్నాం. సూర్య హరిజన్‌ గతంలో ఆమె వృద్ధాప్య పింఛను గ్రామంలోని సీఎస్‌పీ పాయింట్ వద్దే తీసుకునేవారు. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు సీఎస్‌పీ పాయింట్ వద్ద సరిపోలడంలేదు. దీంతో ఆమె బంధువు సాయంతో జారిగోన్‌ బ్రాంచ్‌కు వచ్చి తీసుకుంటున్నారు. ఆమె బ్యాంక్‌కు వచ్చిన వెంటనే వేలి ముద్రలు తీసుకుని, ఖాతా నుంచి నగదు అందజేశాం. ఇకపై ఆమెకు పింఛను ఇంటి వద్దే ఇస్తామని తెలియజేశాం. అలానే, బ్యాంక్‌ తరపున ఆమెకు చక్రాల కుర్చీని అందివ్వాలని నిర్ణయించాం’’అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని