OmPrakash Chautala: మాజీ సీఎం చౌతాలాకు జైలుశిక్ష.. ₹50లక్షల జరిమానా

అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా (87)కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

Published : 27 May 2022 17:28 IST

అక్రమాస్తుల కేసులో ఐఎన్‌ఎల్‌డీ అధినేతకు శిక్ష ఖరారు

దిల్లీ: అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా (87)కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. దీనితోపాటు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ దిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మే 21న ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. చౌతాలాకు శిక్ష, జరిమానాతోపాటు ఆయన పేరుమీదున్న నాలుగు ఆస్తులను కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, వయసు పైబడడం, అనారోగ్య కారణాల దృష్ట్యా తక్కువ శిక్ష విధించాలని ఓంప్రకాశ్‌ చౌతాలా కోర్టుకు విన్నవించగా.. సీబీఐ మాత్రం ఆయనకు గరిష్ఠ శిక్ష విధించాలని అభ్యర్థించింది. తద్వారా సమాజానికి ఒక సందేశాన్ని పంపించవచ్చని పేర్కొంది.

ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (INLD) అధినేత ఓం ప్రకాశ్‌ చౌతాలా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారంటూ సీబీఐ ఆయనపై 2005లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో రూ.6కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన సీబీఐ ఆయనపై 2010లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వీటితోపాటు 2021లో ఆయనపై మనీ లాండరింగ్‌ అభియోగాలు కూడా దాఖలయ్యాయి. తాజాగా తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం, చౌతాలాకు నాలుగేళ్ల శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. 

ఇదిలాఉంటే, ఉపాధ్యాయుల భర్తీలో జరిగిన అక్రమాల కేసులో ఓంప్రకాశ్‌ చౌతాలతోపాటు ఆయన కుమారుడు అజయ్‌ చౌతాలాకు గతంలో పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2013 నుంచి ఆయన తిహార్‌ జైల్లోనే శిక్ష అనుభవించిన చౌతాలా 2021 జులైలో విడుదలయ్యారు. తాజాగా మరో కేసులో చౌతాలాకు నాలుగేళ్ల శిక్ష పడటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని