Omicron: 100కు చేరువైన ఒమిక్రాన్‌ కేసులు.. సగానికి పైగా మహారాష్ట్ర, దిల్లీలోనే!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ దేశంలోనూ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికైనా చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని

Published : 17 Dec 2021 13:33 IST

దిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ దేశంలోనూ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికై చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. దేశ రాజధాని దిల్లీలో తాజాగా మరో 10 మందికి ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 97కు చేరింది.

అయితే కొత్త వేరియంట్‌ కేసుల్లో సగానికి పైగా కేవలం మహారాష్ట్ర, దిల్లీల్లోనే నమోదవడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 32 ఒమిక్రాన్‌ కేసులు బయటపడగా.. దిల్లీలో ఈ సంఖ్య 20కి చేరింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, కేరళలలోనూ ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దిల్లీలో నమోదైన మొత్తం కేసుల్లో.. ఇప్పటికే 10 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు అక్కడి ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపారు.

తమిళనాడులో ఆంక్షలు..

ఒమిక్రాన్‌ ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దేశీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ- రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ప్రయాణికులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఇప్పటివరకు అక్కడ ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది.

యూకేలో 10రెట్లు అధికంగా విజృంభణ..

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ విజృంభిస్తోంది. తొలుత వెలుగుచూసిన దక్షిణాఫ్రికా కంటే యూకేలో 10 రెట్లు ఎక్కువ కేసులు నమోదవడం గమనార్హం. అంతేగాక, ఒమిక్రాన్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశం కూడా అదే. ఇప్పటివరకూ యూకేలో అత్యధికంగా 11,708 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత డెన్మార్క్‌లో 9000, నార్వేలో 1792 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో 1134 మంది దీని బారినపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని