Justice NV Ramana: ఒమిక్రాన్‌ సైలెంట్‌ కిల్లర్‌.. ఇంకా ఇబ్బంది పడుతున్నా..: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ఒమిక్రాన్‌ సోకి తగ్గినప్పటికీ.. దాని ప్రభావంతో తాను ఇంకా బాధపడుతున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో

Updated : 23 Feb 2022 14:31 IST

దిల్లీ: ఒమిక్రాన్‌ సోకి తగ్గినప్పటికీ.. దాని ప్రభావంతో తాను ఇంకా బాధపడుతున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణలు ప్రారంభించాలని ఓ సీనియర్‌ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజేఐ ఇలా స్పందించారు.

‘‘భౌతిక విచారణలు పాక్షికంగా మొదలవడం ఆనందంగా ఉంది. అయితే ఒమిక్రాన్‌ ఇప్పుడు వైరల్‌ జ్వరంగా మారింది. దీని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. ప్రజలు తొందరగా కోలుకుంటున్నారు. అందువల్ల, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణలను పునరుద్ధరించాలని కోరుతున్నా’’ అని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సీజేఐను అభ్యర్థించారు.

దీనికి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ స్పందిస్తూ.. ‘‘నాకు ఆ వేరియంట్‌(ఒమిక్రాన్‌) సోకింది. నాలుగు రోజుల్లోనే తగ్గింది. కానీ ఇంకా నాపై దాని ప్రభావం ఉంది. ఇది సైలెంట్‌ కిల్లర్‌ లాంటిది. నేను కరోనా తొలి వేవ్‌లో వైరస్‌ బారిన పడి త్వరగానే కోలుకున్నా. కానీ, ఇప్పుడు ఈ వేవ్‌లో నాకు ఒమిక్రాన్‌ సోకి 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నా’’ అని అన్నారు. 

దేశంలో కేసులు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయని, బుధవారం కూడా 15వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయని సీజేఐ తెలిపారు. అయితే వైరస్‌ పరిస్థితి సమీక్షించి.. పూర్తి స్థాయి భౌతిక విచారణలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని