Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే తీవ్రమేమీ కాదు..! 

దక్షిణాఫ్రికాలో బయటపడి యావత్‌ దేశాలను వణికిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.

Published : 08 Dec 2021 10:50 IST

అమెరికా వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ 

వాషింగ్టన్‌: దక్షిణాఫ్రికాలో బయటపడి యావత్‌ దేశాలను వణికిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. మునుపటి వేరియంట్లతో పోలిస్తే కొత్త రకానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. కానీ, ఈ వేరియంట్‌ తీవ్రత ఎలా ఉండనుందన్న దానిపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. అయితే గతంలో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ‘డెల్టా’ వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ తీవ్రమైనదేమీ కాదని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు, బైడెన్‌ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అన్నారు. వేరియంట్‌పై వెలువడుతున్న ప్రాథమిక నివేదికలను బట్టి ఈ విషయం వెల్లడవుతోందన్నారు. అయితే మరిన్ని వారాలు గడిస్తేనే దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రావొచ్చన్నారు.

‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలను పరిశీలించాలి. ఒకటి.. వ్యాప్తి; రెండోది.. వ్యాక్సిన్లు, ఇమ్యూనిటీని ఈ వేరియంట్ ఎంతవరకు తప్పించుకుంటుంది?; మూడోది.. వ్యాధి తీవ్రత ఎలా ఉండనుంది? అనే వాటిని అధ్యయనం చేయాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ వేరియంట్‌ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ ముప్పు కూడా గత వేరియంట్ల కంటే ఎక్కువే అని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే ఇమ్యూనిటీ, వ్యాక్సిన్లను కూడా ఒమిక్రాన్‌ తప్పించుకోగలదన్నమాట. చివరగా.. వ్యాధి తీవ్రత విషయానికొస్తే.. కచ్చితంగా డెల్టా కంటే తీవ్రమైనదేమీ కాదని అన్పిస్తోంది’’ అని ఫౌచీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

దక్షిణాఫ్రికాలో వేరియంట్ పరిస్థితిని అధ్యయనం చేసి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఫౌచీ తెలిపారు. ‘‘ఒమిక్రాన్‌.. తీవ్రతను చెప్పేందుకు కొన్ని నివేదికలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూస్తున్న కేసులు.. ఒమిక్రాన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరికల మధ్య నిష్పత్తిని బట్టి చూస్తే ఇది డెల్టా కంటే తక్కువ తీవ్రమైనదే అని చెప్పొచ్చు. అయితే ఈ డేటాతో ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. వ్యాధి తీవ్రతను అంచనా వేయాలంటే మరో రెండు వారాలైనా పడుతుంది. ఎందకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువ ఉన్నట్లయితే అది ఊరటనిచ్చే అంశమే అని అభిప్రాయపడ్డారు.

వేరియంట్ మూలం ఎక్కడో..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఇప్పటివరకు కనీసం 38 దేశాలకు పాకింది. ఈ వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకు మరణాలు నమోదు కాకపోవడం సానుకూలాంశం. అయితే ఈ వేరియంట్‌ అధిక మ్యూటేషన్లు కలిగి ఉండటం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ ఎలా వచ్చిందన్నదానిపై స్పష్టమైన ఆధారాల్లేవు. అయితే ప్రధానంగా రెండు థియరీలు వినిపిస్తున్నట్లు ఫౌచీ తెలిపారు. ‘‘ఒమిక్రాన్‌ మూలంపై రెండు థియరీలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ రోగిలో కరోనా ఉత్పరివర్తనం చెంది ఒమిక్రాన్‌ పుట్టుకొచ్చి ఉండొచ్చు. లేదా కరోనా మనుషుల నుంచి జంతువులకు సోకి.. మళ్లీ వాటి నుంచి మానవులకు వ్యాప్తి చెంది ఉండొచ్చు’’ అని ఫౌచీ అన్నారు.

అయితే ఏదిఏమైనా ఈ వేరియంట్‌ పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో మాస్క్‌లు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఫౌచీ సూచించారు. టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని