Omicron scare: దిల్లీ, ముంబయిల్లోకొవిడ్‌ గ్రాఫ్‌ మళ్లీపైకి.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ!

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతున్న వేళ కొవిడ్‌ కేసులూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే దిల్లీ, ముంబయి మహానగరాల్లో పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది. మరోవైపు, ఒమిక్రాన్‌ కేసులు కూడా......

Published : 26 Dec 2021 01:40 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి కొనసాగుతున్న వేళ కొవిడ్‌ కేసులూ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే దిల్లీ, ముంబయి మహానగరాల్లో భారీగానే కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ మహమ్మారి కట్టడికి మళ్లీ కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు కూడా నిబంధనల్ని ప్రకటిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 2వరకు పలు కొవిడ్‌ నిబంధనలు ప్రకటించింది. దిల్లీలో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనుల నుంచి రూ.1.5కోట్లు జరిమానా వసూలు చేశారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు సంబంధించిన కొన్ని వార్తలు సంక్షిప్తంగా..!

దిల్లీలో 37%.. ముంబయిలో 10% పెరిగిన కొవిడ్‌ కేసులు

దేశ రాజధాని నగరంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 249 కొత్త కేసులు వచ్చాయి. నిన్నటితో (180 కేసులు) పోలిస్తే కేసుల్లో 38శాతం పెరుగుదల నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. కొత్తగా 96మంది కోలుకోగా.. ఒక మరణం నమోదైంది. ప్రస్తుతం దిల్లీలో క్రియాశీల కేసుల సంఖ్య 934కి పెరిగింది. ఈరోజు దిల్లీలో 57,295 శాంపిల్స్‌ని పరీక్షించారు.

మరోవైపు, మహారాష్ట్రలోని ముంబయిలో కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా 757 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో (683 కేసులు) పోలిస్తే ఈ సంఖ్య 10శాతం అధికం కావడం గమనార్హం. అలాగే, కొత్తగా మరో 280మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ముంబయిలో ప్రస్తుతం 3703 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముంబయిలో కొత్తగా మరణాలేమీ నమోదు కాలేదు. 24గంటల వ్యవధిలో ఇక్కడ 42427 శాంపిల్స్‌ పరీక్షించారు.

దిల్లీలో ఉల్లంఘనులకు ₹1.5కోట్ల జరిమానా!

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి జరిమానాలు విధిస్తోంది. ఈ నెల 22, 23 తేదీల్లో జరిమానా రూపంలో 1.5కోట్ల మొత్తం వసూలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో తూర్పు దిల్లీ, ఉత్తర దిల్లీ ప్రాంతాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. తూర్పు దిల్లీ నుంచి 1245 మంది ఉండగా.. ఉత్తర దిల్లీ నుంచి 1446 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరి నుంచి 1.5కోట్ల మేర వసూలు చేసినట్టు వివరించారు. మాస్క్‌ ధరించకుండా తిరగడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని 7,778 మందిని పట్టుకొని 163 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు చెప్పారు. 

విదేశాలకు ప్రయాణాలకు వెళ్లకపోయినా వైద్యుడికి ఒమిక్రాన్‌

బెంగాల్‌లో ఓ జూనియర్‌ వైద్యుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. కోల్‌కతా వైద్య కళాశాల ఆస్పత్రికి చెందిన 21 ఏళ్ల  జూనియర్‌ వైద్యుడికి వైరస్‌ సోకడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4కి చేరింది. అతడికి జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడి శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కి పంపగా శుక్రవారం రాత్రి వచ్చిన నివేదికలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బాధితుడిని కోల్‌కాలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. బాధితుడు నదియా జిల్లాలోని కృష్ణానగర్‌కు చెందినవాడిగా గుర్తించారు. అయితే, అతడు విదేశీ ప్రయాణాలకు వెళ్లకపోయినా ఒమిక్రాన్‌ సోకింది. దీంతో అతడికి ఎలా సోకిందనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

హరియాణాలో తాజా ఆంక్షలు

హరియాణాలో నైట్‌ కర్ఫ్యూ అమలుచేస్తున్నట్టు సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నిన్న ప్రకటించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. బహిరంగ కార్యక్రమాలు, వేడుకలకు 200 మంది మించరాదని నిబంధన విధించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్షించిన అనంతరం తాజా ఆంక్షల్ని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ పూర్తి కాకపోతే బహిరంగ ప్రదేశాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించిన హరియాణా ప్రభుత్వం.. జనవరి 1 నుంచి రెండో డోసును తప్పనిసరి చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

యూపీలో నేటి నుంచే నైట్‌ కర్ఫ్యూ

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా శనివారం (డిసెంబర్ 25) నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని తెలిపింది. అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా పాల్గొన్న వారంతా తప్పకుండా కొవిడ్ నిబంధలను పాటించాలని స్పష్టం చేసింది.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని