South Africa: ఊపిరి పీల్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. రెండేళ్ల కర్ఫ్యూ ఎత్తివేత!

ఒమిక్రాన్‌ కలవరం కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో భారీ ఎత్తున కేసులతో ఒకవైపు ఫ్రాన్స్‌, యూకే, అమెరికా తదితర దేశాలు సతమతం అవుతుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంటోది! ఈ దేశంలో దాదాపు రెండేళ్లుగా కొనసాగిన రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను...

Updated : 31 Dec 2021 17:03 IST

కేప్‌టౌన్‌: ఒమిక్రాన్‌ కలవరం కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో భారీ ఎత్తున కేసులతో ఒకవైపు ఫ్రాన్స్‌, యూకే, అమెరికా తదితర దేశాలు సతమతం అవుతుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంటోది! ఈ దేశంలో దాదాపు రెండేళ్లుగా కొనసాగిన రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను తాజాగా ఎత్తేయడం గమనార్హం. స్థానికంగా నాల్గో వేవ్.. గరిష్ఠ(పీక్‌) స్థాయిని దాటడమే ఇందుకు కారణమని స్థానిక అధికారులు చెబుతున్నారు. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్(ఎన్‌సీసీసీ), ప్రెసిడెంట్స్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ (పీసీసీ) సమావేశాల అనంతరం ప్రెసిడెన్సీ ఈ నిర్ణయం ప్రకటించింది. ‘కర్ఫ్యూ ఎత్తేస్తున్నాం. ప్రజల రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు’ అని ఒక ప్రకటనలో తెలిపింది. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను పెంచినట్లు చెప్పింది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నాల్గో వేవ్‌ తీవ్రత తగ్గగా.. ఒమిక్రాన్‌ కేసులు కొనసాగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌ తొలుత ఈ దేశంలోనే బయటపడిన విషయం తెలిసిందే. ‘దేశంలోని తొమ్మిది ప్రావిన్సుల్లో రెండు మినహా మిగతా అన్నింటిలో కేసులు తగ్గుముఖం పట్టాయి. అధిక వ్యాక్సినేషన్‌ రేటు, ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉండటం, మరణాల సంఖ్యలో అతి స్వల్ప పెరుగుదల.. తదితర సూచికలు దేశంలో నాల్గో వేవ్ గరిష్ఠ స్థాయిని దాటి ఉండొచ్చని సూచిస్తున్నాయి’ అని ప్రెసిడెన్సీ పేర్కొంది. అయితే.. ఒమిక్రాన్‌ ముప్పు తొలగలేదని చెబుతూనే.. ప్రజలంతా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది. టీకాలు వేయించుకోవాలని చెప్పింది. 15 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున.. 12 ఏళ్లు, ఆపైబడిన పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు